
టి20 ప్రపంచకప్ సూపర్8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 107 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. బ్రాడ్ ఎవన్స్ (43), డియాన్ మేయర్స్ (28), కెప్టెన్ సికందర్ రజా (27) మాత్రమే కాస్త రాణించారు. విండీస్ బౌలర్లలో మోటి నాలుగు, అకీల్ హుస్సేన్ మూడు, మాథ్యూ ఫోర్డ్ రెండు వికెట్లు తీశారు.
హెట్‌మెయిర్ వీర విధ్వంసం
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (12), షాయ్ హోప్ (14)లు విఫలమయ్యారు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను షిమ్రోన్ హెట్‌మెయిర్, రొమన్ పొవెల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు దూకుడుగా ఆడి స్కోరు పరిగెత్తించారు. హెట్‌మెయిర్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. జింబాబ్వే బౌలర్లను హడలెత్తించిన షిమ్రోన్ వరుస ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు.
ఈ క్రమంలో 19 బంతుల్లోనే రికార్డు అర్ధ సెంచరీని నమోదు చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హెట్‌మెయిర్ 34 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 85 పరుగులు చేశాడు. పొవెల్ 35 బంతుల్లోనే 4 సిక్స్‌లు, మరో నాలుగు బౌండరీలతో 59 పరుగులు సాధించాడు. రూథర్ ఫోర్డ్ 13 బంతుల్లోనే అజేయంగా 31 పరుగులు చేశాడు. షెఫర్డ్ (21), హోల్డర్ (13) కూడా దూకుడుగా ఆడడంతో విండీస్ రికార్డు స్కోరును నమోదు చేసింది.