
తెలంగాణ లోని కాజీపేటలో 160 ఎకాల విస్తీర్ణంలో ఉన్న రైల్వే కోచ్ తయారీ యూనిట్ ను అభివృద్ధి చేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ మధ్య ఫ్యాక్టరీని భారతీయ రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం చేసేందుకు 13.15 కిలోమీటర్ల ట్రాక్ పై డీజిల్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. డీజిల్ రైలు ట్రయిల్ రన్ కోసం ఫ్యాక్టరీ నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ కు ట్రాక్ నిర్మించారు. ఈ ట్రాక్ ద్వారా ఇక ముందు ఫ్యాక్టరీలో తయారు చేసిన కోచ్ లను స్టేషన్ కు తీసుకువచ్చి, వివిధ రైల్వే జోన్ లు, డివిజన్ లకు పంపే అవకాసం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ట్రయిల్ రన్ తో రైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కాంప్లెక్స్ నుంచి ప్రధాన రైల్వే నెట్ వర్క్ కు ట్రాక్ కనెక్టివిటీ పూర్తయినట్లు స్పష్టమైంది. మార్చిలో అధికారికంగా ప్రారంభానికి ముందు ఇది సన్నాహక కార్యక్రమం. భారతీయ రైల్వేల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ ను ఓ ప్రధాన రోలింగ్ స్టాక్ తయారీ, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ యూనిట్ ను ప్రాజెక్టు అమలు సంస్థగా ఆర్ విఎన్ ఎల్ అమలు చేస్తోందని కూడా సంస్థ పేర్కొంది.
ఢిల్లీ – చెన్నై కారిడార్ లో భాగమైన బల్హార్షా- సికింద్రాబాద్ మార్గంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని కాజీ పేట ప్రధాన రైల్వే జంక్షన్ వ్యూహాత్మకంగా కీలకమైనది. సమీపంలోనే రైల్ మ్యాన్యు ఫ్యాక్చరింగ్ యునిట్ ఏర్పాటయింది. దేశవ్యాప్తంగా రోలింగ్ స్టాక్ ను సమర్థంగా పంపించేందుకు జాతీయ రోలింగ్ స్టాక్ తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఉత్తర -దక్షిణ, తూర్పు, పశ్చిమ కనెక్టివిటీ సులభతరం కాగలదని అధికారులు అంటున్నారు.
కాజీపేట లోని రైల్వే తయారీ యూనిట్ లో విజయవంతమైన ట్రయల్ రన్ , ప్రధాన రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం ఈ ప్రాజెక్టు అమలులో మైలురాయి వంటిదని ఆర్ విఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సలీం అహ్మద్ అన్నారు. దీని వల్ల భారతదేశ రైల్వే తయారీ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కాగలవని ఆయన పేర్కొన్నారు. ప్రధానయూనిట్, పెయింట్ విభాగం, టెస్ట్ యూనిలోని యంత్రాలు, ప్లాంట్ ఇన్ స్టలేషన్ లు పూర్తయ్యాయి. 2026 మార్చి నాటికి అధికారికంగా ప్రారంభానికి సర్వం సిద్ధమవుతున్నదని ఆర్ విఎన్ ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.