Reading Time: < 1 minute

ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ లో రూ.590 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్లు ఆదివారం నాడు బ్యాంక్ ప్రకటించింది. హరియాణా ప్రభుత్వ ఖాతాల్లో సిబ్బంది రూ. 590 కోట్ల మేరకు మోసం చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది. చండీగఢ్ లోని బ్యాంక్ ప్రత్యేక శాఖలోని కొంతమంది ఉద్యోగులు హరియాణా రాష్ట్రప్రభుత్వ ఖాతాలనుంచి మోసపూరితంగా, అనధికారికంగా నగదు మళ్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో ఇతర వ్యక్తులు, సంస్థలు, ఇతర పక్షాల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. హరియాణా ప్రభుత్వం లోని ఒక విభాగం ఈ బ్యాంక్ లోని తన ఖాతాను మూసివేసి, ఆ ఖాతాలోని నిధులను మరో బ్యాంక్ కు మళ్లించవలసిందిగా కోరినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

బ్యాంక్ ప్రస్తుతానికి వేసిన అంచనా ప్రకారం జరిగిన మోసం రూ. 590 కోట్లు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. క్లెయిమ్ ల ధ్రువీకరణ, ఏఏ విధమైన రికవరీలు జరిగాయో తేలిన తర్వాత తుది మొత్తాన్ని నిర్ణయిస్తారని బ్యాంక్ పేర్కొంది. ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ లో పని చేస్తున్న నలుగురు అధికారులను తక్షణం సస్పెండ్ చేసి, దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మోసానికి పాల్పడిన ఉద్యోగులు ఇతర వ్యక్తులు కఠిన మైన క్రమశిక్షణ చర్యలు, సివిల్, క్రమినల్ చర్యలు తీసుకుంటామని బ్యాంక్ హామీ ఇచ్చింది.ఈ మోసం బయటపడగానే, ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఫిబ్రవరి 20 న బ్యాంక్ కు సంబంధించిన మోసాల కేసుల పర్యవేక్షిణ, ఫాలో – అప్ కోసం బోర్డు ప్రత్యేక కమిటీ దృష్టికి తీసుకువెళ్లింది. ఒక రోజు తర్వాత ఆడిట్ కమిటీ, బోర్డుకు తెలియజేసింది.