Reading Time: 2 minutes

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ విశేషంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవర్‌స్టార్‌ను ఆవిష్కరించిన ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి రెండవ గీతంగా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదలైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పవర్‌స్టార్ ఆరాను ప్రతిబింబించేలా ఈ గీతముంది. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ గీతావిష్కరణ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ పాటకు ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అని ఏ ముహూర్తాన పెట్టామో.. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ ఆరా కనిపిస్తుంది.

‘నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే’. సినిమాలో ఒక సన్నివేశంలో ఈ డైలాగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాల నుంచి ఈ మేనరిజమ్ చేస్తున్నారు. దీనికి మాట రూపంలో చెప్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఆలోచన నుంచి ఈ డైలాగ్ వచ్చింది. ఆ మాటను హుక్ లైన్ గా తీసుకొని మంచి పాటగా మలిచాము. ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ కలమే కావాలి అనిపించింది. వెంటనే చంద్రబోస్‌ని కలిసి ఈ పాట గురించి చెప్పాము. కేవలం ఎనిమిది గంటల్లో పాట సిద్ధమైంది. ఇది పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వచ్చిన పాట కాదు. ఆయన మీద అవగాహనతో రాసిన పాట. ఏ లైన్ విన్నా పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి.

అభిమానులకు నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘దేఖ్లేంగే సాలా’ విని, చాలా రోజుల తరువాత నాకు డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం కలిగిందని పవన్ కళ్యాణ్ నన్ను అభినందించారు. అలాగే ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాట విని నాకు ఫోన్ చేసి, చాలా బాగుందని అభినందించారు. ఈ పాట చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ‘ఆరా ఆఫ్ పవన్ కళ్యాణ్’. ఎప్పటికీ నిలిచిపోయే పాట ఇది’ అని తెలిపారు. ఈ వేడుకలో గీత రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.