
పంజాబ్‌లోని మొహాలీ-ఖరార్ ప్రాంతంలో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జరిపిన సోదాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. మనీ లాండరింగ్, భూ కుంభకోణాల ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ తనిఖీల్లో హై లెవెల్ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అసలేం ఏం జరిగిందంటే
ఖరార్‌లోని ‘వెస్టన్ టవర్’ అనే భవనానికి ఈడీ అధికారులు చేరుకోగానే, తొమ్మిదో అంతస్తులోని ఒక ఫ్లాట్ నుంచి కొందరు వ్యక్తులు హడావిడిగా డబ్బు సంచులను కిందకు విసిరేశారు. డబ్బు సంచులు కింద పడే క్రమంలో రూ. 500 నోట్ల కట్టలు గాలిలో ఎగిరాయని, అది చూసి అక్కడి వారు షాక్‌కు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అధికారులు లోపలికి వెళ్లేలోపు, వ్యాపారవేత్త నితిన్ గోహల్‌కు చెందిన డ్రైవర్‌గా అనుమానిస్తున్న వ్యక్తి.. కింద పడిన సంచులను తీసుకుని కారులో పరారయ్యాడు. ప్రస్తుతం ఈడీ బృందాలు ఆ కారు కోసం గాలిస్తున్నాయి.
మొహాలీ, చండీగఢ్ ప్రాంతాల్లో దాదాపు 12 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులపై అధికారులు గురిపెట్టారు. అయితే గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (GMADA) ద్వారా భూమి వినియోగ అనుమతుల్లో (CLU) అక్రమాలు జరిగాయని, పెట్టుబడిదారులు, సామాన్య ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. సన్‌టెక్ సిటీ, ఆల్టస్ బిల్డర్స్, ధీర్ కన్‌స్ట్రక్షన్స్ వంటి సంస్థలతో పాటు వ్యాపారవేత్త నితిన్ గోహల్ నివాసాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అకాలీదళ్ సీనియర్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజీతియా ఈ వీడియోలను షేర్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవనం పైనుంచి డబ్బు సంచులు విసిరేయడం చూస్తుంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతానికి ఈడీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ తనిఖీల్లో భారీగా అక్రమ డబ్బు, కీలకమైన పేపర్స్ దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది.