Reading Time: < 1 minute

దక్కన్ సిమెంట్స్‌‌పై విచారణకు సీఈసీ ఆదేశాలు

Caption of Image.
  • అటవీ భూమి ఆక్రమణలపై రాష్ట్ర అధికారులకు నోటీసులు
  • ఈ నెల 25న హాజరు కావాలని ఆదేశం

పాలకవీడు, వెలుగు: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని సైదులు నామ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అటవీ భూమి ఆక్రమణల ఆరోపణలపై దక్కన్ సిమెంట్స్ యాజమాన్యంపై విచారణకు సుప్రీం కోర్టు పరిధిలో పనిచేసే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అటవీ శాఖ, పర్యావరణ శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి ఈ నెల 25న కమిటీ ఎదుట హాజరై పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అటవీ భూమిలో వందల ఎకరాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదులపై నివేదిక సమర్పించాలని పేర్కొంది. సైదులు నామ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో భారీ స్థాయిలో భూ ఆక్రమణ జరిగిందని పసుపులేటి సురేశ్​ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ప్రధానమంత్రి ఆఫీసుకు చేరడంతో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించాలని సూచించినట్లు తెలిసింది. అనంతరం విషయం సుప్రీం కోర్టు పరిధిలోని సీఈసీ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దక్కన్ సిమెంట్స్ వ్యవహారంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఈ నెల 25న జరిగే విచారణలో రాష్ట్ర అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటవీ భూముల పరిరక్షణలో ఈ కేసు కీలకంగా మారవచ్చని న్యాయవర్గాలు 
భావిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.