
- నైనీ బ్లాక్‌లో 350 మిలియన్ టన్నుల బొగ్గు
- ఏండ్ల పాటు తవ్వినా తరగని నిల్వలు
- తాడిచర్ల బ్లాక్ మాదిరిగా ప్రైవేట్‌కు అప్పగిస్తే ఏటా వేల కోట్ల నష్టం
- సంస్థే నిర్వహిస్తే ఆర్థిక లాభంతో పాటు కార్మికులకు చేతినిండా పని
హైదరాబాద్, వెలుగు : ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌ను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకుండా సింగరేణి సంస్థే నిర్వహిస్తే బాగుంటుందనే చర్చ ఆ సంస్థ ఉన్నతాధికారుల్లో జరుగుతోంది. జెన్‌కోకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్ నిర్వహణను బీఆర్ఎస్ సర్కార్ ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీని వల్ల సదరు సంస్థకు జెన్‌కో ఏటా రూ.750 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు నైనీ బ్లాక్‌ను సైతం ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తే సింగరేణి పాత్ర కూడా నామమాత్రంగా మారడంతో పాటు ఏటా వేల కోట్లు కోల్పోవాల్సి వస్తుంది.
వాస్తవానికి బొగ్గును తవ్వి తరలించడంలో సింగరేణికి అపార అనుభవం ఉంది. ఇప్పటికే సంస్థ వద్ద ఉన్న సాంకేతికతను, యంత్ర సామగ్రిని, కార్మికులను అవసరాన్ని బట్టి నైనీ కోల్బ్లాక్తో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. దీని వల్ల ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటు రెట్టింపు లాభాలు వచ్చే అవకాశముంది. నైనీ బ్లాక్‌లో 350 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నందున సింగరేణితో పాటు కార్మికుల భవిష్యత్దృష్ట్యా దీనిని సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
70 ఏండ్ల పాటు తవ్వుకోవచ్చు..
ఒడిశా రాష్ట్రంలోని అంగూల్జిల్లా కరోల్బహాల్ప్రాంతంలో నైనీ బొగ్గు బ్లాక్ఉంది. ఇక్కడ 350 మిలియన్ టన్నుల క్వాలిటీ బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణితో పాటు కేంద్ర బొగ్గు గని సంస్థలు గుర్తించాయి. సింగరేణి సంస్థ ప్రస్తుతం రాష్ట్రంలో 17 ఓపెన్ కాస్ట్, 22 అండర్ గ్రౌండ్ మైన్లతో కలిపి సగటున నెలకు సుమారు ఐదు మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. అదే నైనీ బొగ్గు బ్లాక్‌లో యేటా ఐదు మిలియన్ టన్నుల బొగ్గు తవ్వినా 70 ఏండ్ల పాటు కొనసాగించవచ్చు.
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ బొగ్గు బ్లాక్‌ను కోల్ఇండియా సహా బడా ప్రైవేట్ కంపెనీల పోటీని తట్టుకొని సింగరేణి సంస్థ దక్కించుకుంది. ఇక్కడ ఎంతో నాణ్యమైన జీ10 రకం బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ తవ్వి తీసిన బొగ్గును మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సరఫరా చేస్తోంది.
బీఆర్ఎస్ హయాం నుంచే…
నైనీ బొగ్గు బ్లాక్‌లోనూ ఓవర్ బర్డెన్, బొగ్గు తవ్వి తీసే పనులతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులను ప్రైవేట్ఏజెన్సీలకు అప్పగించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలోనే సింగరేణి సంస్థ ఇటీవల టెండర్లు పిలిచింది. 25 ఏండ్ల పాటు పనులు అప్పగించేలా అగ్రిమెంట్లు చేసుకోవడానికి సిద్ధమైంది. కానీ టెండర్ గడువు ముగియక ముందే ప్రైవేట్కంపెనీల మధ్య పోటీ కారణంగా పెద్దఎత్తున రాజకీయ దుమారం రేగింది.
టెండర్లలో పెట్టిన ఒక చిన్న నిబంధనను సాకుగా చూపుతూ సింగరేణి సంస్థపై కేంద్ర బొగ్గు గనులశాఖకు ఫిర్యాదులు అందాయి. దీనిపై కేంద్రం నుంచి వచ్చిన కమిటీ సైతం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సింగరేణికి నైపుణ్యం కలిగిన కార్మికులు, యంత్ర పరికరాలు ఉన్నప్పటికీ తాడిచర్ల మాదిరిగా బొగ్గు తవ్వి తీసే పనులను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ఏంటన్న చర్చ ఇటు కార్మిక సంఘాలు, అటు సింగరేణి ఆఫీసర్లలో మొదలైంది.
ఇప్పటికే తాడిచర్ల బ్లాక్ ప్రైవేట్ సంస్థకు..
భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్‌కో దక్కించుకుంది. ఇక్కడ గనిపై మట్టి, రాళ్లు తీసే ఓవర్ బర్డెన్ పనిని, బొగ్గు తవ్వి సప్లై చేయడం, ఆపరేషన్అండ్ మెయింటెనెన్స్ పనులను సింగరేణికి కాకుండా ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పగించింది.
ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గును ఇదే జిల్లాలోని చెల్పూర్ దగ్గర జెన్‌కో ఆధ్వర్యంలో నిర్వహించే కేటీపీపీకి సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం జెన్‌కో సంస్థ ఏఎంఆర్‌కు ఏటా రూ.750 కోట్లకు పైగా చెల్లిస్తోంది. దీంతో పేరు జెన్‌కోది.. వ్యాపారం మాత్రం ప్రైవేట్ ఏజెన్సీది అన్నట్లు తయారైన వ్యవహారంపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. బీఆర్‌ఎస్ సర్కార్ తీరుపై సింగరేణి కార్మిక సంస్థలు, ఇతర రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోశాయి.