Reading Time: < 1 minute

ఖైదీలకు లైఫ్‌లైన్.. జైళ్లలో స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి..: బెయిల్ తర్వాత నటుడు రాజ్‌పాల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..

Caption of Image.

రూ. 9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

జైలు నుంచి విడుదలయ్యాక తన సొంత గ్రామం షాజహాన్‌పూర్‌లో రాజ్‌పాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో ఉన్నట్లే జైళ్లలో కూడా ధూమపానం (Smoking) కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. జైళ్లు అనేవి మనుషులను హింసించేవిగా కాకుండా, వారిని మార్చే సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

 ప్రముఖ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) ఉదాహరణ ఇస్తూ… కేబీసీలో  లైఫ్‌లైన్‌లు ఉన్నట్లే, జైలులో మంచి ప్రవర్తన ఉన్న ఖైదీలకు కూడా ఒక లైఫ్‌లైన్ అవకాశం  ఇవ్వాలి. చిన్న చిన్న తప్పులు చేసి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారు 10% మంది ఉంటారని, వారిని గుర్తించి విడుదల చేస్తే దేశానికి ఉపయోగపడతారని ఆయన అన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా జైళ్లను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

తనకు బెయిల్ ఇచ్చినందుకు ఢిల్లీ హైకోర్టుకు రాజ్‌పాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు 2012 నుండి నడుస్తోందని, కోర్టు ఎప్పుడు పిలిచినా తాను హాజరయ్యానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ మిత్రులు సోనూ సూద్, మీకా సింగ్ వంటి వారికి ధన్యవాదాలు తెలిపారు.

రాజ్‌పాల్ యాదవ్ లక్ష రూపాయల బాండ్ ఇవ్వడంతో  పాటు, బకాయి మొత్తంలో కొంత భాగాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. మార్చి 18న తరువాత  విచారణ జరగనుంది. అప్పటిలోగా మిగిలిన బకాయిలు చెల్లిస్తే ఆయనకు మరింత ఊరట లభించే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.