Reading Time: < 1 minute

అపార్ట్మెంట్‎లో గ్యాస్ లీకై భారీ పేలుడు: నిద్రలోనే 16 మంది సజీవ దహనం

Caption of Image.

ఇస్లామాబాద్: పాకిస్తాన్‎లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. గురువారం (ఫిబ్రవరి 19) తెల్లవారుజూమున 4.30 గంటల ప్రాంతంలో ఓ నివాస భవనంలో శక్తివంతమైన పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిద్రలోనే 16 మంది సజీవ దహనమయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఘటన స్థలంలో రెస్క్యూ టీమ్స్ సహయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు.

 ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. గ్యాస్ లీక్ వల్లే పేలుడు సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. 

ఓల్డ్ సోల్జర్ బజార్ ప్రాంతంలోని ఓ నివాస భవనం మొదటి అంతస్తులో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. గ్యాస్ కొరత కారణంగా చాలా కుటుంబాలు ఇంట్లో ఎల్పీజీ సిలిండర్లను నిల్వ ఉంచుకుంటున్నాయని.. స్టోరేజీ చేసిన సిలిండర్ లీక్ కావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. 

ఘటన స్థలం నుంచి 16 మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించామని చెప్పారు. గాయపడిన 14 మందిని ట్రీట్మెంట్ నిమిత్తం సమీప ఆసుపత్రుల్లో జాయిన్ చేశామని తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. పేలుడు కారణంగా భవనం శిథిలావస్థకు చేరుకుందన్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అనే అనుమానంతో ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 
 

©️ VIL Media Pvt Ltd.