Reading Time: < 1 minute
Telangana Teachers Officers Delegation Vietnam Study Tour

తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, అభ్యసన ఫలితాలు మెరుగుపరచడమే లక్ష్యంగా అంతర్జాతీయ అధ్యయన పర్యటనలను నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 2025 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో ఫిన్‌లాండ్ (ఏప్రిల్ 2026), జపాన్ (సెప్టెంబర్ 2026), సింగపూర్ (సెప్టెంబర్ 2026లో రెండు విడతలు) దేశాలకు విజయవంతంగా అధ్యయన బృందాలను పంపిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా 5వ విడతగా విద్యాశాఖలోని 40 మంది ఉపాధ్యాయులు, అధికారులతో కూడిన బృందాన్ని వియత్నాంకు పంపుతోంది.

హనోయిలోని “వియత్నాం ఎడ్యుకేషన్ స్ట్రాటజీ అండ్ పాలసీ ఇన్‌స్టిట్యూట్” (VESPI) సహకారంతో ఈ 5 రోజుల పర్యటన 2026 అక్టోబర్ 11 నుంచి 17 వరకు (ప్రయాణ సమయంతో కలిపి) కొనసాగనుంది. జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) బి. వెంకటనరసమ్మ నేతృత్వంలో వెళ్తున్న ఈ బృందంలో జిల్లా కలెక్టర్ల కమిటీలు ఎంపిక చేసిన ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, డీఈఓలు మరియు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు భాగస్వాములుగా ఉన్నారు.

ఈ అధ్యయన పర్యటనలో భాగంగా వియత్నాం విజయం వెనుక ఉన్న విద్యార్థి-కేంద్రక బోధనా పద్ధతులు, సమ్మిళిత విద్య, పాఠ్యప్రణాళిక అమలు, మూల్యాంకన విధానాలు, ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, PISA పరీక్షలో అత్యుత్తమ పనితీరు , బోధనలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ICT) వినియోగం వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు. పర్యటన సమయంలో ప్రతినిధుల బృందం స్థానిక పాఠశాలలను సందర్శించడంతో పాటు ప్రముఖ విద్యావేత్తలతో వర్క్‌షాప్‌లు, తరగతి గది బోధనా పద్ధతుల పరిశీలన , ఇంటరాక్టివ్ సెషన్లలో చురుగ్గా పాల్గొంటారు.