Reading Time: < 1 minute
124 Former Ias Ifs Officers Back Election Commission Amid Vote Chori Claims

Gyanesh Kumar: భారత ఎన్నికల సంఘం (ECI), ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), జ్ఞానేశ్ కుమార్‌లకు భారీ మద్దతు లభించింది. ఈసీకి మద్దతు తెలుపుతూ 124 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించే వారు అందుకు విశ్వసనీయ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఎన్నికల వ్యవస్థపై అక్రమ ఆరోపణలు చేస్తూ, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని హెచ్చరించారు. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని, ఎస్ఐఆర్‌ను సమర్థి్స్తూ 42 మంది మాజీ న్యాయమూర్తులు మద్దతు తెలిపారు.

లేఖలో భారత ప్రజలను ఉద్దేశించి ఈ లేఖను రాశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ‘ఓట్ చోరీ’కి పాల్పడ్డారని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమయంలో మాజీ బ్యూరోక్రాట్లు ఈ లేఖను విడుదల చేయడం సంచలనంగా మారింది.

ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎం మిషన్లను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల పర్యవేక్షణ వంటి బాధ్యతల్ని నిర్వహించిన అనుభవం తమకు ఉందని మాజీ అధికారులు లేఖలో పేర్కొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి చెందినవాళ్లం కాదని, ఆధారాలు లేకుండా మన ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని పదే పదే ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ సారి ఓట్ చోరీ అనే పదాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

గతంలో ఎన్నికల్లో అక్రమాలు ఎలా జరిగేవో తమకు తెలుసని, పోలింగ్ కేంద్రాల వద్ద తుపాలకులతో బెదిరింపులు, ప్రభావవంతమైన వ్యక్తుల అనుచరుల దాడులు, బ్యాలెట్ పెట్టెల్లో అక్రమంగా ఓట్లు వేయడం, ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలు అప్పట్లో చోటుచేసుకునేవని తెలిపారు. బూత్ క్యాప్చరింగ్ విస్తృతంగా ఉండటంతో 1989లో పార్లమెంట్ దానిని నేరంగా పరిగణిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుందని లేఖలో గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా అవసరమని చెప్పారు.