Reading Time: < 1 minute

UPI ఛార్జీలు కట్టాల్సిందే.. స్టే ఇవ్వని సుప్రీంకోర్టు

Caption of Image.

రూ.2వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. రూ.2వేల కంటే ఎక్కువ విలువైన కమర్షియల్ యూపీఐ పర్సన్-టు-మర్చంట్ (P2M) లావాదేవీలపై ఛార్జీలను విధిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ స్టీరింగ్ కమిటీలకు అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన జ్యుడీషియల్ బెంచ్.. ఇది కేవలం చట్టపరమైన అంశం కంటే సాంకేతిక పరమైన సమస్యగా ఎక్కువగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. డిజిటల్ పేమెంట్స్ గేట్‌వేను ఉపయోగిస్తున్న మొత్తం వినియోగదారులలో దాదాపు 96 శాతం మందికి ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ కోర్టుకు తెలిపారు.

ప్రస్తుతానికి యూపీఐ ఛార్జీల విధింపుపై ఎలాంటి స్టే ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ.. ఈ అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని సంబంధిత ప్రతివాదులను సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానం, మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంశంపై తదుపరి విచారణలో మరిన్ని స్పష్టతలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అత్యున్నత ధర్మాసనం కూడా యూపీఐ ఛార్జీలపై ఎలాంటి రిలీఫ్ ప్రకటించలేదు. 

©️ VIL Media Pvt Ltd.