Reading Time: 2 minutes
Virat Kohli Reveals Favorite Batting Partner Toughest Bowler And Best Captain

Virat Kohli Reveals His Best Captain: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ లేటెస్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కెరీర్‌లోని ఇష్టాలు, అభిమానించే ఆటగాళ్లు, అత్యుత్తమ భాగస్వాములు, ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ల గురించి కింగ్ సూటిగా సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, జస్ప్రీత్ బుమ్రా, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ ఆటగాళ్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఇష్టమైన బ్యాటింగ్ భాగస్వామి ఎవరని అడగ్గా.. ఎలాంటి ఆలోచన లేకుండా రోహిత్ శర్మ పేరును విరాట్ కోహ్లీ చెప్పాడు. రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడంలో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సమాధానం మరోసారి చాటింది. తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రాను పేర్కొన్నాడు. తనకు ఇష్టమైన ప్రత్యర్థి జట్టు ఏదని ప్రశ్నించగా.. పాకిస్థాన్ అని సమాధానమిచ్చాడు. తనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ మైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం అని కోహ్లీ చెప్పాడు.

తన కెరీర్‌లో ఆడిన కెప్టెన్లలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరని అడిగితే.. ఎంఎస్ ధోనీ అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ధోనీని ఒక్క మాటలో అభివర్ణించాల్సి వస్తే ‘మాస్టర్‌మైండ్’ అని చెప్పాడు. తన ప్రైమ్‌లో ఉన్నప్పుడు ఎవరిని ఎదుర్కోవడానికి ఇష్టపడరని అడగ్గా.. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేరును చెప్పాడు. తనతో కలిసి ఆడిన అత్యుత్తమ ఫీల్డర్‌గా దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ ను కోహ్లీ ఎంపిక చేశాడు. టీ20 లేదా వన్డేల్లో ఏ ఫార్మాట్‌ను ఇష్టపడతావని అడగ్గా.. వన్డే క్రికెట్ అని సమాధానమిచ్చాడు. అయితే వన్డే లేదా టెస్టు క్రికెట్‌లో ఏది ఇష్టమని ప్రశ్నించగా.. టెస్టు క్రికెట్ తన ఎంపిక అని కోహ్లీ స్పష్టం చేశాడు.

భారత ఆటగాళ్లలో తాను అత్యంత అభిమానించే క్రికెటర్ ఎవరని అడగ్గా.. మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరును కింగ్ కోహ్లీ చెప్పాడు. ఇక మ్యాచ్‌ను కేవలం కొన్ని నిమిషాల్లోనే మలుపు తిప్పగల ఆటగాడు ఎవరని ప్రశ్నించగా.. వెస్టిండీస్ స్టార్ ఆండ్రీ రస్సెల్ పేరును పేర్కొన్నాడు. చివరగా రోహిత్ శర్మను ఒక్క మాటలో ఎలా అభివర్ణిస్తావని అడగ్గా ‘ఎఫర్ట్‌లెస్’ అని కోహ్లీ చెప్పాడు. ఎంఎస్ ధోనీని ‘మాస్టర్‌మైండ్’, రోహిత్‌ను ‘ఎఫర్ట్‌లెస్’గా పేర్కొంటూ కోహ్లీ ఇచ్చిన సమాధానాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.