Reading Time: < 1 minute
Pvn Madhav Urges Chandrababu To Remove Eligible Lands From 22 A List

PVN Madhav: ఆంధ్రప్రదేశ్‌లో సెక్షన్‌ 22-A పరిధిలో ఉన్న అర్హత కలిగిన భూములపై నిషేధాన్ని తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. అర్హత కలిగిన ప్రైవేట్‌, ఫ్రీహోల్డ్‌ భూములను తక్షణమే 22-A జాబితా నుంచి తొలగించి, వాటి యజమానులకు రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఒకే సర్వే నంబర్‌కు సంబంధించి ఉన్న డూప్లికేట్‌, పాత లేదా ఆధారాలు లేని 22-A ఎంట్రీలను తొలగించాలని మాధవ్‌ సూచించారు. ఏదైనా భూమిని 22-A జాబితాలో ఎందుకు చేర్చారు, అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు, గెజిట్‌ లేదా ఇతర రికార్డు ఏమిటనే వివరాలను భూ యజమానులకు పారదర్శకంగా తెలియజేసే ఆన్‌లైన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు.

అర్హత లేని భూములు 22-A జాబితాలో కొనసాగకుండా స్పష్టమైన పరిశీలనా విధానాన్ని అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. 22-A నుంచి భూమిని తొలగించేందుకు వచ్చే దరఖాస్తులపై విచారణ, నిర్ణయం, అప్పీల్‌ ప్రక్రియకు స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయించాలని సూచించారు. ధృవీకరణ పూర్తయి, చట్టపరంగా రిజిస్ట్రేషన్‌కు అర్హత కలిగిన భూములకు రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

అలాగే జిల్లా వారీగా 22-A జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని మాధవ్‌ కోరారు. దీనివల్ల రైతులు, భూ యజమానుల్లో ఉన్న అనిశ్చితి తొలగుతుందని పేర్కొన్నారు. భూమి యాజమాన్యానికి సంబంధించిన వివరాల్లో పారదర్శకత పెరగడంతో పాటు, అర్హులైన భూ యజమానులకు తమ ఆస్తిపై హక్కులను వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో వివరించారు. రైతుల భూమి వారి ఆర్థిక భద్రతకు, కుటుంబ అవసరాలకు, భవిష్యత్‌ తరాలకు అత్యంత ముఖ్యమైన ఆస్తి అని పీవీఎన్‌ మాధవ్‌ పేర్కొన్నారు. అందువల్ల అర్హత కలిగిన భూములను 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌..