
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ‘తగ్గేదే లే’ అంటోంది. తాజాగా విడుదలైన జీఎస్టీ వసూళ్ల లెక్కలు దేశ ఆర్థిక పటుత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. 2026 ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వసూళ్లతో కొత్త రికార్డు నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.2 లక్షల 43వేల కోట్లకు చేరాయి. గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.2లక్షల 23వేల కోట్లతో పోలిస్తే ఇది 8.7 శాతం వృద్ధి. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, దేశీయంగా వినియోగం, ఆర్థిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని లెక్కలు నిరూపిస్తున్నాయి.
దిగుమతుల జోరు.. పెరిగిన నెట్ రెవెన్యూ
ఈ రికార్డు వసూళ్లలో దిగుమతుల వాటా భారీగా ఉంది. దిగుమతుల ద్వారా వచ్చే స్థూల ఆదాయం 25.8 శాతం పెరిగి రూ. 57వేల 580 కోట్లకు చేరుకుంది. ఇక రిఫండ్‌లను మినహాయించిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు రూ.2లక్షల11 వేల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే నికర వసూళ్లలో 7.3 శాతం వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా దిగుమతులపై నికర రాబడి 42.9 శాతం మేర పెరగడం విశేషం.
రిఫండ్‌ల పంపిణీలోనూ వేగం..
ప్రభుత్వం కేవలం వసూళ్లపైనే కాకుండా, వ్యాపారులకు చెల్లించాల్సిన రిఫండ్‌ల విషయంలోనూ అంతే వేగంగా వ్యవహరించింది. ఈ నెలలో రిఫండ్‌ల పంపిణీ ఏకంగా 19.3 శాతం పెరిగి రూ.31వేల 793 కోట్లకు చేరింది. దేశీయ వసూళ్లు రూ.లక్షా 85వేల కోట్లతో 4.3 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
మార్చి నెలలో కూడా రూ.లక్షా 78వేల కోట్ల నికర వసూళ్లతో జీఎస్టీ తన జోరును చూపించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం 2025-26ను పరిశీలిస్తే, స్థూల జీఎస్టీ ఆదాయం 8.3 శాతం పెరిగి రూ. 22లక్షల 27వేల కోట్లకు చేరింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి ప్రధాన రాష్ట్రాలు ఈ వసూళ్లలో సింహభాగాన్ని కలిగి ఉన్నాయి. యుద్ధ కాలంలోనూ భారత్ ఇలాంటి అద్భుతమైన వసూళ్లను సాధించడం ఆర్థిక నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది.