
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంలో చిక్కి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ముడిచమురు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) వంటి ఇంధనాలను పుష్కలంగా కలిగిన రష్యా, వెనెజువెలా వంటి కొద్ది దేశాలకు మాత్రమే ఇందులో మినహాయింపు. తాజా పరిస్థితుల కారణంగా ప్రపంచంలోనే ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌ను ఇంధన సంక్షోభం పట్టి కుదిపివేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు సముద్ర మార్గాలే కీలకం. ఎనభై శాతం చమురు జలమార్గాల గుండానే వివిధ దేశాలకు సరఫరా అవుతోంది. ఈ మార్గాలకు ఏదైనా అవాంతరం వాటిల్లితే అనేక దేశాలు చమురు అందక సతమతమవుతాయి.
ఇప్పుడు జరుగుతున్నది అదే. అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడిగా ఇరాన్‌పై విరుచుకుపడటంతో గల్ఫ్ దేశాలనుంచి ఇంధన నౌకలు రాకపోకలు సాగించే హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఫలితంగా ఇరాన్, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా తదితర దేశాలనుంచి చమురు రవాణా దాదాపుగా స్తంభించిపోయింది. గ్యాస్ సిలిండర్లు అందక మధ్యతరగతి, పేదవర్గాల వంటిళ్లలో పొయ్యిలో పిల్లి లేవడం లేదు. మెస్‌లు, హోటళ్లు, హాస్టళ్లు, ఆస్పత్రులలోని క్యాంటీన్లు సైతం గ్యాస్ లేక నత్తనడక నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు కొరత లేదంటూనే వాణిజ్య సిలిండర్ల విక్రయంపై ఆంక్షలు విధించి, గృహోపయోగానికి వినియోగించే సిలిండర్లు సజావుగా సరఫరా అయ్యేందుకు చర్యలు చేపడుతోంది. చమురు, సహజవాయువు సరఫరాకు సమస్యలు తలెత్తకుండా నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించడాన్ని బట్టి పరిస్థితి ఎంత జటిలంగా ఉందో అర్థమవుతోంది. గ్యాస్ బండతో సగటు భారతీయ మహిళకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. స్వాతంత్య్రం వచ్చిన ఏడెనిమిదేళ్లకు దేశంలోకి ప్రవేశించిన గ్యాస్ సిలిండర్ తో వంటింట్లో పడుతున్న కష్టాలనుంచి మహిళలకు కూడా స్వాతంత్య్రం లభించినట్లయింది.
కట్టెలు, పిడకలతో వంట చేయలేక, పొగతో ఊపిరాడక పడే బాధలనుంచి వారికి విముక్తి లభించింది. తాజా సంక్షోభం వారు ఇంతకుముందు ఎరగనిది. అనుకోకుండా వచ్చిపడిన ఈ ఉపద్రవంనుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సగటు భారతీయ మహిళ సతమతమవుతోంది. సౌరశక్తి ఆధారంగా నడిచే సోలార్ కుక్కర్లు, హైబ్రిడ్ సోలార్ స్టవ్‌లు, ఇండక్షన్ స్టవ్ లు వంటి సాధనాలు ఉన్నా, ధరలు అందుబాటులో లేని కారణంగా వీటి వినియోగం అంతంతమాత్రంగానే ఉంది. ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానం భారత్ దే. 2040 నాటికి మన చమురు అవసరాలు ఆకాశాన్నంటుతాయన్నది ఒక అంచనా. అటువంటి పరిస్థితుల్లో భౌగోళిక రాజకీయ ఘర్షణలు తలెత్తినా, సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడినా చమురు అందక ఆయా దేశాలు సంక్షోభంలో కూరుకుపోక తప్పదు. తాజా ఉదంతమే ఇందుకు ఉదాహరణ. రవాణా సమస్యల కారణంగా ఇరాక్, కువైట్‌లలో ముడి చమురు, ఎల్‌పిజి ఇంధన నిల్వలు పేరుకుపోయాయి.
దీంతో ఆయా దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. మరోవైపు ఇరాన్ లోని చమురు కేంద్రాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియాలోని అరాంకోకు చెందిన అతి పెద్ద చమురు శుద్ధి రిఫైనరీ రస్ తనూరా మూతబడింది. ఈ నేపథ్యంలో యుద్ధం ముగిసినా ఇప్పటికిప్పుడు చమురు కొరతనుంచి గట్టెక్కుతామని అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి, తాజా ఉదంతంనుంచి మనం పాఠాలు నేర్వకపోతే జాతి క్షమించదు. చమురు దిగుమతులు మన ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పాలకులు ఇకనైనా దృష్టి సారించాలి. గత దశాబ్ద కాలంగా దేశంలో సౌరశక్తి వినియోగం పుంజుకున్నమాట వాస్తవమే.
అయినా ఇప్పటికీ ఇది సామాన్యుడికి అందుబాటులో లేదనడం అతిశయోక్తి కాదు. పిఎం-కుసుమ్, ప్రధాని సూర్యఘర్, ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాల ద్వారా మధ్యతరగతి ప్రజానీకం ఇప్పుడిప్పుడే సౌరశక్తి వినియోగంవైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో సహజ వాయువు, సౌరశక్తి వినియోగం పెంచడాన్ని పాలకులు ఒక ఉద్యమంగా చేపట్టవలసిన అవసరం ఉంది. అదే సమయంలో దేశీయంగా ముడిచమురు వెలికితీతకు నడుం బిగించాలి. రాజస్తాన్ లోని బర్మర్ జిల్లా, గుజరాత్ లోని గల్ఫ్ ఆప్ ఖంబాట్, ముంబయి హై, గోదావరి- కృష్ణా బేసిన్, అసోంలలో మాత్రమే ప్రస్తుతం చమురు ఉత్పత్తి అవుతోంది. ఇవిగాక, గుజరాత్ లోని కచ్, కావేరీ బేసిన్, ఒడిశాలోని మహానది బేసిన్, బెంగాల్ లోని హుగ్లీ బేసిన్ లో చమురు, సహజ వాయువు అపారంగా ఉన్నట్లు వెల్లడైన నేపథ్యంలో, అక్కడ వనరుల వెలికితీతకు ఉపక్రమించడం అత్యవసరం.