
ప్రతి ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి రాజకీయ పార్టీల ఆలోచనలు, విధానాలు, పాలనాపరమైన పనితీరు ఆధారంగా సమాన అవకాశాలతో పోటీ చేసే వేదికగా ఉండాలి. ఎన్నికల ఫలితాల చట్టబద్ధత కేవలం ఓటు వేయడం పైనే కాకుండా, ఆ ఓటింగ్‌కు ముందు జరిగిన మొత్తం ప్రక్రియ ఎంత నిష్పక్షపాతంగా సాగిందన్న దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ఈ సూత్రాన్ని ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) ద్వారా అమలు చేస్తారు. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు ప్రకటించిన వెంటనే భారత ఎన్నికల సంఘం ఈ నియమావళిని అమలులోకి తీసుకొస్తుంది. ఈ కోడ్ ప్రకారం ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రచార ప్రయోజనాలకు వినియోగించడం నిషేధం. కొత్త సంక్షేమ పథకాల ప్రకటనలు చేయడం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం వంటి చర్యలకు కూడా ఆంక్షలు ఉంటాయి. అదేవిధంగా, అధికారంలో ఉన్న పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రజాకర్షక హామీలు ఇవ్వకుండా కూడా ఈ కోడ్ నిరోధిస్తుంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) స్ఫూర్తి చాలా సరళమైనది. ప్రభుత్వాలు రాష్ట్ర అధికారాన్ని లేదా ప్రజా వనరులను ఉపయోగించి ఎన్నికల్లో ప్రయోజనం పొందకూడదు. అయితే గత కొన్నేళ్లుగా ఒక ధోరణి కనిపిస్తోంది. అది నియమావళి సమయాన్ని సాంకేతికంగా పాటించినట్టే కనిపించినా, దాని అసలు ఉద్దేశాన్ని మాత్రం పక్క దారి పట్టించేలా ఉంది. ఎన్నికల సంఘం, ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే కొద్ది రోజుల ముందు ప్రభుత్వాలు హఠాత్తుగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం, కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం వంటి చర్యలకు దిగుతున్నాయి.
దాంతో ఎన్నికలకు ముందు వారాల్లోనే ప్రకటనలు, రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇటీవలి నెలల్లో అసోం రాష్ట్రం ఈ ధోరణికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. అక్కడ ప్రధానమంత్రి, రాష్ట్ర నాయకత్వం పాల్గొన్న అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వరుసగా జరిగాయి. ఇటీవల అసోం పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు వాటికి శంకుస్థాపనలు కూడా చేశారు. వీటిలో జాతీయ రహదారులు, అంతర్గత జలమార్గాలు, రైలు అనుసంధానం, ఇతర మౌలిక వసతుల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుందని నివేదికలు సూచించాయి. కొన్ని ప్రకటనల్లో వంతెనలు, రహదారి కారిడార్లు, అంతర్గత జలమార్గ టెర్మినల్స్, రైల్వే సేవలు వంటి కనెక్టివిటీని మెరుగుపరచే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రాంతీయ రవాణా, అభివృద్ధికి తోడ్పడే లక్ష్యాన్ని ప్రకటించేవిగా ఉన్నాయి. అదే సమయంలో అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించడంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
ఫ్లైఓవర్లు, వంతెనలు, రహదారి మౌలిక సదుపాయాలు, ప్రజా సౌకర్యాల ప్రాజెక్టులు వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా ప్రారంభం కావడం లేదా ప్రకటించడం జరుగుతోంది. ఒక్కో ప్రాజెక్టును విడివిడిగా చూసినప్పుడు అవి అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలే కావచ్చు; అవి చాలా కాలం క్రితమే ప్రణాళికలో ఉన్నవే కావచ్చు. ఏదిఏమైనప్పటికీ మౌలిక వసతులను నిర్మించడం, ప్రజా సేవలను విస్తరించడం ప్రభుత్వాల బాధ్యతే. అయితే ఎన్నికలకు కొద్ది రోజులముందు చాలా తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో ఈ తరహా కార్యక్రమాలు వరుసగా జరగడం ప్రారంభమైతేనే ఆందోళనలు వ్యక్తమవుతాయి. భారత రాజకీయ చరిత్రలో ఘనంగా శంకుస్థాపనలు చేసి తరువాత మరుగునపడిపోయిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎన్నికలకు ముందు ఘనంగా ప్రకటించిన ప్రాజెక్టులు ప్రారంభం కావడానికి సంవత్సరాలు పట్టిన సందర్భాలూ ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్టులు వేడుకలు ముగిసిన తరువాత కూడా చాలా కాలం పూర్తి కాకుండా అసంపూర్తిగా మిగిలిపోయాయి.
ఈ ధోరణి పునరావృతమైనప్పుడు కొన్నిసార్లు ప్రాజెక్టు కంటే వేడుకకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రకటనలతోనే రాజకీయ సందేశం ముగియదు. సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు ఎన్నికల వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అసోంలో అరుణోదోయ్, లక్షపతి బైదేవ్ వంటి పథకాలు మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని విస్తృత ప్రచారం పొందాయి. ఈ పథకాల ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది. అదే సమయంలో, ఇలాంటి పథకాలకు లభించే ప్రచారం సమయం, స్థాయి తరచుగా సమీపిస్తున్న ఎన్నికలతోనే ముడిపడి ఉంటాయి. ఎన్నికల ముందు వాతావరణంలో కనిపించే మరో ముఖ్య అంశం ప్రభుత్వ ప్రకటనల విస్తృతి. ఎన్నికలకు ముందు నెలల్లో ప్రభుత్వ విజయాలను ప్రముఖంగా చూపిస్తూ పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు తరచుగా కనిపిస్తాయి. టెలివిజన్ ఛానెళ్లు మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై ప్రచార సందేశాలను ప్రసారం చేస్తాయి. అలాగే డిజిటల్ వేదికలపై కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం విజయాలను కీర్తిస్తూ ప్రాయోజిత ప్రచారాలను ప్రదర్శిస్తాయి. ఈ ప్రకటనలన్నీ ప్రభుత్వ ఖజానా -అంటే ప్రజల డబ్బుతోనే నిధులు సమకూరుతాయి.
ఇది ఒక స్పష్టమైన నైతిక ప్రశ్నను లేవనెత్తుతోంది: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార నాయకత్వం సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడం సముచితమా? ప్రజల నిధులను ఇటువంటి ప్రచార కార్యక్రమాలకు వినియోగించినప్పుడు, పరిపాలన, రాజకీయ ప్రచారం మధ్య ఉన్న గీత మరింత అస్పష్టంగా మారుతుంది. చారిత్రాత్మకంగా ఎన్నికల నిర్వహణలో ‘భారత ఎన్నికల సంఘం’ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
విశాలమైన, వైవిధ్యభరితమైన దేశంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ఈ సంస్థ పాత్రకు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు లభించాయి. ఎన్నికల్లో నిష్పక్షపాతాన్ని కాపాడటంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) ఒక ముఖ్యమైన సాధనంగా నిలిచింది. ఈ నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత మంత్రులు కొత్త పథకాలను ప్రకటించలేరు. ప్రభుత్వ వాహనాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు. అలాగే అధికార యంత్రాంగం పూర్తిగా తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నికల సంఘంపై విమర్శలు కూడా పెరిగాయి. ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజంలోని కొన్ని వర్గాలు, ఫిర్యాదులకు స్పందించడంలో ఎన్నికల సంఘం కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా లేదా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల ప్రకటన ఎప్పుడు వస్తుందో సుమారుగా ముందే అంచనా వేసి, ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందు పెద్ద ప్రకటనలు, కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు ఎంతవరకు నిజం అన్నది వేరే విషయం అయినప్పటికీ, అవి ఒక అభిప్రాయ సమస్యను మాత్రం సృష్టించాయి. ఏ ఎన్నికల సంస్థకైనా అధికారిక హోదాతోపాటు ప్రజల విశ్వాసం కూడా అంతే ముఖ్యం.
రాజకీయ పోటీ స్వరూపం మారుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల వ్యవస్థ కూడా పరిణామం చెందాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను అధికారంగా ప్రకటించడానికి బహుశా మూడు నుంచి ఆరు నెలల ముందు వరకు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పరిమితులను ఒక నిర్దిష్ట కాలానికి పొడిగించడం ఒక సంభావ్య సంస్కరణ. ఇటువంటి నిబంధన, ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే ప్రకటనలు చేయడానికి ఉండే తొందరపాటు ప్రేరణను తగ్గించగలదు. ఇంకో సంస్కరణగా ఎన్నికలకు ముందు నెలల్లో ప్రభుత్వ ప్రకటనలపై మరింత కఠిన నియంత్రణలు అమలు చేయడం గురించి కూడా ఆలోచించవచ్చు. ప్రజా నిధులు ప్రధానంగా ప్రభుత్వ విధానాలు, సేవల గురించి పౌరులకు సమాచారం అందించడానికి ఉపయోగపడాలి; రాజకీయ నాయకత్వాన్ని ప్రచారం చేయడానికి కాదు. ప్రభుత్వ ప్రకటనల ఖర్చు, ఉద్దేశం వంటి విషయాల్లో పారదర్శకతను పెంచితే బాధ్యతాయుత పరిపాలనకు దోహదపడుతుంది. అలాగే శంకుస్థాపన కార్యక్రమాలపై మరింత కచ్చితమైన పరిశీలించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రతి శంకుస్థాపన ప్రకటనలో ప్రాజెక్టు అమలు గడువు, నిధుల కేటాయింపు, పురోగతిని పర్యవేక్షించే విధానాలు వంటి వివరాలు స్పష్టంగా ఉండాలి. ఘనంగా ప్రకటించిన ప్రాజెక్టులు సంవత్సరాల పాటు పూర్తికాకుండా ఉండిపోతే, ఆ ఆలస్యానికి ప్రభుత్వాలు సమాధానం చెప్పే బాధ్యత కూడా ఉండాలి. మొత్తానికి ఈ సమస్య ఏకైక రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుత చర్చలు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీ విధానాలపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, వేర్వేరు పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ధోరణులే కనిపిస్తాయి.
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాలనే ఆకర్షణ రాజకీయాల్లో సహజంగానే ఉంటుంది. అయితే ప్రజాస్వామ్య పోటీని వక్రీకరించకుండా ఉండాలంటే, ఇటువంటి చర్యలను నియంత్రించే నియమాలను సంస్థలు, పౌరులు కచ్చితంగా పాటించాల్సిందే. ప్రజాస్వామ్యం బలంగా నిలవాలంటే ఇదే కీలకం. దశాబ్దాలుగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్ప స్థిరత్వాన్ని ప్రదర్శించింది. అయితే దాని విశ్వసనీయత ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడంపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి అత్యవసరమైనవే. కానీ అభివృద్ధి ఎన్నికల లాభం కోసం ప్రదర్శనగా మారకూడదు. అది ఎన్నికల క్యాలెండర్‌కు అనుగుణంగా జరిగే కార్యక్రమంగా కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళిక, పారదర్శకత, బాధ్యతాయుత ఆధారంగా నిరంతర ప్రక్రియగా కొనసాగాలి.
గీతార్థ పాఠక్
ఈశాన్యోపనిషత్
(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)