
Off The Record: కొణిదెల నాగబాబు…. జనసేన ఎమ్మెల్సీ. ఆయనకు మంత్రి పదవి గురించి చాలా రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వెంటనే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు. ఆ దిశగా అంతకు ముందే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిఉండటంతో… నాగబాబుకు మినిస్టర్ పోస్ట్ లాంఛనమేనని అనుకున్నారు అంతా. కానీ… టైం గడుస్తున్నా… ఆ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. పైగా.. ఆసలు ఆయనకు ఛాన్స్ దక్కుతుందా లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఎమ్మెల్సీ తీసుకున్న ఒక నిర్ణయం ఆ అనుమానాలను బలపరుస్తోంది. గతంలో ఒక సక్సెస్‌ఫుల్ కామెడీ ప్రోగ్రామ్‌కు జడ్జిగా వ్యవహరించారు నాగబాబు. ఆ తర్వాత వివిధ కారణాలతో దాన్నుంచి తప్పుకున్నారాయన. కానీ… తిరిగి ఇప్పుడు అదే కార్యక్రమంలోకి రీ ఎంట్రీ ఇచ్చేశారాయన. సరిగ్గా ఇక్కడే డౌట్ కొడుతోంది చాలామందికి. మంత్రి పదవి ఆశలు సజీవంగా ఉంటే… ఆయన తిరిగి ఆ కార్యక్రమానికి వచ్చేవారు కాదని, తిరిగి బుల్లితెర మీద యాక్టివిటీ పెంచుతున్నాంటే ఇక మినిస్టర్ ఛాన్స్ లేదన్న నిర్ధారణకు వచ్చేశారా అన్న చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణల్ని దృష్టిలో ఉంచుకుని తనకిక ఛాన్స్ రాదని ఆయన క్లారిటీకి వచ్చి ఉండవచ్చంటున్నారు కొందరు.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక టీవీ ప్రోగ్రామ్స్‌ని బాగా తగ్గించుకుని రాజకీయాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టారాయన. ఆ క్రమంలోనే ఎమ్మెల్సీ పదవి దక్కింది. అదే ఊపులో మంత్రి కూడా ఇస్తారని అనుకున్నా ఆ ఒక్కటీ జరగలేదు. ఇప్పటికే పవన్‌కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరికీ ఒకే క్యాబినెట్‌లో చోటు ఉంటుందా అన్న చర్చలు సైతం చాన్నాళ్ళు జరిగాయి. ఇలాంటి చర్చోపచర్చల నడుమ పుణ్యకాలం కాస్తా గడిచిపోతోందని, తనకు అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయని గ్రహించే నాగబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. తాను పాత కార్యక్రమంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు స్వయంగా నాగబాబే కన్ఫామ్ చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబు కొందరు మంత్రుల పనితీరుపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో… ఈసారి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భారీ మార్పులు ఉండవచ్చని అంటున్నారు. జనసేన కోటాలో నాగబాబుకు కూడా ఛాన్స్ వస్తుందని అంతా అనుకుంటున్న టైంలో… ఆయన బుల్లితెర కార్యక్రమాల్లో బిజీ అవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కాస్త ఆలస్యమైనా మంత్రి పదవి గ్యారంటీగా దక్కుతుందన్న భరోసా ఉంటే… ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోరన్న వాదన సైతం ఉంది. ఎందుకంటే… మంత్రిగా అమరావతిలో బాధ్యతలు నిర్వహించాలి, షూటింగ్ కోసం వారంలో సగం హైదరాబాద్‌లో ఉండాలి. ఏక కాలంలో ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అంత తేలిక కాదు. పైగా ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ కామెడీ ప్రోగ్రామ్ జడ్జిగా వ్యవహరిస్తే రాజకీయ విమర్శలు పెరిగిపోతాయి. ఇలా… ఒకదానికొకటిగా వీటన్నిటినీ బేరీజు వేసి చూసుకుంటే… మంత్రి పదవి మీద ఆశలు వదిలేసుకునే ఆయన పాత ప్రోగ్రామ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఉండవచ్చన్న విశ్లే,ణలు పెరుగుతున్నాయి.
ఇక్కడ ఇంకో కారణం కూడా చూపిస్తున్నాయి రాజకీయ వర్గాలు. గతంలో మాజీ మంత్రి రోజా కూడా ఇదే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు. అప్పుడు ఆమె మీద కూడా రకరకాల విమర్శలు వచ్చాయి. అయితే… ఎమ్మెల్యేగా ఉన్నన్నాళ్లు ప్రోగ్రామ్‌ని కొనసాగించిన రోజా…. మంత్రి పదవి రాగానే దానికి బైబై చెప్పేశారు. అలాంటిది ఇప్పుడు నాగబాబు మంత్రి పదవి వస్తే… అదే కార్యక్రమాన్ని కొనసాగించే వీలుండదని అంటున్నారు. పోస్ట్ వస్తుందని ఏ మాత్రం ఆశ ఉన్నా…. ఆయన ఇంకొన్నాళ్ళు ఎదురు చూసేవారని, ఆ విషయంలో క్లారిటీ వచ్చినందునే ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారా అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. స్వయంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా ఎందుకు అనుమానాలు పెరుగుతున్నాయంటే… కుల సమీకరణలు కూడా కారణం కావచ్చన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్‌తో కలిపి కేబినెట్‌లో జనసేన తరపున ముగ్గురు ఉండగా… అందులో ఇద్దరు కాపులు. ఉన్న ఎంపీలు ఇద్దరు, మరో ఎమ్మెల్సీ కూడా కాపులే. ఈ సమీకరణల కోణంలోనే వెనక్కి తగ్గి ఉండవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. తాను కుటుంబ పాలనకు వ్యతిరేకమని తరచూ చెబుతుంటారు పవన్‌కళ్యాణ్. అలాంటిది ఒకే కేబినెట్‌లో అన్నదమ్ములు ఉండటం ఎంతవరకు కరెక్ట్ అన్న విమర్శలు సైతం వినిపించాయి. వీటన్నిటికీ మించి ఎమ్మెల్సీ అయ్యాక నాగబాబు రాష్ట్రంలో అంత యాక్టివ్‌గా కనిపించలేదు. ముఖ్యమైన పార్టీ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. పదవి అంటే బాధ్యత అంటూ…. ఒక సందర్భంలో పార్టీ శ్రేణుల ముందే అన్నను హెచ్చరించారు పవన్. ఆ ఎఫెక్ట్‌తో కొంతకాలం యాక్టివ్‌గా కనిపించినా… ఇప్పుడు సడన్‌గా పాత కామెడీ ప్రోగ్రామ్‌లోకి రీ ఎంట్రీతో మంత్రి పదవి మీద ఆశలు వదిలేసుకుని ఉండవచ్చన్న ప్రచారం మొదలైంది.