Reading Time: < 1 minute
India Set Target Of 256 Runs For New Zealand

T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో భారత్ నేడు (మార్చి 8) న్యూజిలాండ్‌తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ టైటిల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ శుభారంభం అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ భీకరమైన ఫామ్ తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. కివీస్ కు 256 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ లు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. అభిషేక్ బాధ్యత తీసుకుని 18 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఎనిమిదో ఓవర్ లో అభిషేక్ శర్మ రచిన్ రవీంద్ర చేతికి చిక్కడంతో టీం ఇండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. సంజు సామ్సన్ 11వ ఓవర్లో తన అర్ధశతకం చేరుకున్నాడు. సంజు కేవలం 33 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.

ఇది ప్రపంచ కప్‌లో అతని వరుస మూడో అర్ధశతకం. ఇషాన్ కూడా అదే ఓవర్‌లో 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. 16వ ఓవర్లో సంజు 46 బంతుల్లో 89 పరుగుల వద్ద ఔటవడంతో టీం ఇండియా మరో ఎదురుదెబ్బ తగిలింది. కానీ అదే ఓవర్లో ఇషాన్ కూడా తన వికెట్ కోల్పోయాడు. కిషన్ 54 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్య అదే ఓవర్లో పరుగులు చేయకుండానే ఔటయ్యాడు. నీషమ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు. 19వ ఓవర్లో హార్దిక్ తన వికెట్ కోల్పోయాడు. చివరి ఓవర్లో దుబే 26 పరుగులు సాధించాడు. చివరి 5 ఓవర్లలో భారత బ్యాట్స్‌మెన్ 52 పరుగులు సాధించారు.