Reading Time: < 1 minute
Iran Warship Attack Tragic Angle Commander Stubbornness 87 Dead

Iran Ship Attack: ఇరాన్ యుద్ధం వేళ, శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి టార్పిడో దాడి చేసింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. విశాఖపట్నంలో మిలన్ నేవీ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణమైన ఐరిస్ డేనా అనే యుద్ధ నౌక సబ్‌మెరైన్ దాడిలో మునిగిపోయింది. ఈ ఘటన సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. దీంట్లో 87 మంది మరణించగా, 32 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ దొరకలేదు.

అయితే, ఈ ఘటన వెనక విషాద కోణం వెలుగులోకి వచ్చింది. దాడికి ముందు ఇరాన్ యుద్ధనౌకలో ఉన్న సిబ్బంది తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. సిబ్బంది యుద్ధ నౌక విడిచిపెట్టాలని  అమెరికన్ దళాలు రెండుసార్లు ఆదేశించాయని అతను చెప్పినట్లు తెలిసింది. ఈ దాడిలో ఇతను కూడా మరణించాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియాకు వెల్లడించారు.

హెచ్చరించినా, కమాండర్ మొండితనం:

అయితే కమాండర్ మొండితనమే పదుల సంఖ్యలో నావికుల మరణానికి కారణమైనట్లు తెలిసింది. అమెరికా దళాలు హెచ్చరిస్తున్నప్పటికీ యుద్ధనౌక కమాండర్ నావికులు నౌకను వదిలిపెట్టడానికి ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించాడు. కమాండర్, అతడి సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనేక మంది నావికులు కమాండర్‌‌తో వాదించారు. కమాండర్ మాట లెక్క చేయని 32 మంది నావికులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరంతా లైఫ్ బోట్ల ద్వారా యుద్ధ నౌకకు దూరంగా వచ్చారు.

దీని తర్వాత, అమెరికన్ సబ్‌మెరైన్ USS షార్లెట్ అనే లాస్ ఏంజిల్స్-క్లాస్ ఇరాన్ యుద్ధ నౌకపై దాడి చేసింది. ఇది మార్క్ 48 టార్పెడోలను ప్రయోగించి, ఇరాన్ నౌకను ముంచేసింది. నౌక ముందు భాగానికి టార్పెడో తగిలి ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి నీరు ఒక్కసారిగా ఎగిసిపడింది. దీనికి సంబంధించిన వీడియోను అమెరికా విడుదల చేసింది.