
అమరావతి: గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూపై కల్తీ జరిగిందని పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలిందని, లడ్డూ కల్తీపై దీక్ష చేశానని అన్నారు. ఎపి శాసనసభలో సమావేశాలు జరిగాయి. తిరుమల లడ్డూలో కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చలో డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ చేశారని, నెయ్యి లేకుండానే నెయ్యి తయారు చేశారని నివేదికలు స్పష్టంగా చెప్పాయని తెలియజేశారు. గత ప్రభుత్వాధినేత తప్పుచేశారని తానెక్కడా చెప్పలేదని, టిటిడి బోర్డుదే తప్పని చెప్పానని అన్నారు. టిటిడి బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదని పవన్ పేర్కొన్నారు.
శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని, దీని నుంచి లబ్ధి పొందేది ఏమీ ఉండదని అన్నారు. ఇది హిందూమతంలో కాకుండా వేరే ఎవరికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేవారని విమర్శిచారు. అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం అని.. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికి ఇలా జరగడం బాధాకరమని అన్నారు. లడ్డూ కల్తీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఆమూక్త మాల్యదలోని 218 పద్యంను పవన్ చదివారు. భగవంతుడిని డబ్బుతో ఆడుకున్న వారి తరాలు లేచిపోతాయని, మీరు ఢిల్లీకి వెళ్లి కేసులు వేస్తే మీరు మరింత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పవన్ సూచించారు.