
Property Law India: సాధారణంగా తల్లిదండ్రుల ఆస్తి అంటే అది తమదేనని, దానిపై తమకు పూర్తి హక్కు ఉంటుందని చాలా మంది పిల్లలు భావిస్తుంటారు. అయితే భారతీయ చట్టాల ప్రకారం ఇది ఎప్పుడూ నిజం కాదు. ఆస్తి రకాన్ని బట్టి హక్కులు మారుతుంటాయి. భావోద్వేగాలకు తావులేకుండా, ఆస్తి స్వభావాన్ని బట్టి చట్టం నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా ఆస్తులను రెండు రకాలుగా విభజించవచ్చు.. స్వార్జిత ఆస్తి, పురాతన లేదా వారసత్వ ఆస్తి.
స్వార్జిత ఆస్తి..
ఒక వ్యక్తి తన సొంత సంపాదనతో, కష్టపడి కొనుగోలు చేసిన ఇల్లు, స్థలం లేదా దుకాణాన్ని ‘స్వార్జిత ఆస్తి’ అంటారు. ఈ ఆస్తిపై ఆ వ్యక్తికి మాత్రమే పూర్తి అధికారాలు ఉంటాయి. ఈ ఆస్తిపై పిల్లలకు పుట్టుకతో ఎలాంటి హక్కు రాదు. ఆ వ్యక్తి తన ఇష్టానుసారం ఆ ఆస్తిని ఎవరికైనా అమ్ముకోవచ్చు, గిఫ్ట్‌గా రాసి ఇవ్వచ్చు. దీనికి చట్టం ఏం చెబుతోందంటే.. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం, తండ్రి తన స్వార్జిత ఆస్తి విషయంలో తన ఇష్టప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. పిల్లలు దీనిపై చట్టపరంగా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేరు.
పురాతన లేదా వారసత్వ ఆస్తి
వరుసగా నాలుగు తరాల నుంచి విభజన జరగకుండా వస్తున్న ఆస్తిని పురాతన ఆస్తిగా పరిగణిస్తారు. దీనిని ‘హిందూ అవిభాజ్య కుటుంబ’ (HUF) ఆస్తి అంటారు. ఇక్కడే చట్టం కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన ఆస్తిలో పిల్లలకు పుట్టుకతోనే హక్కు వస్తుంది. తండ్రి ఒంటరిగా ఈ ఆస్తిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. ఈ ఆస్తిని అమ్మాలన్నా లేదా ఎవరికైనా బదిలీ చేయాలన్నా కుటుంబంలోని వారసులందరి అంగీకారం తప్పనిసరి. ఆ కుటుంబంలో చిన్నపిల్లలున్నా వారి వాటాను ఎవరూ తొలగించలేరు.
ఆస్తిని గుర్తించడం ఎలా అంటే..
ఏ ఆస్తి పురాతనమైనదో, ఏది కాదో గుర్తించడానికి చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ ఆస్తి కనీసం నాలుగు తరాల నుంచి వస్తూ ఉండాలి. గతంలో ఆ ఆస్తిపై ఎప్పుడూ లీగల్ పార్టిషన్ జరిగి ఉండకూడదు. ఒకవేళ ఏదైనా ఆస్తి బహుమతి రూపంలో లేదా వీలునామా ద్వారా వచ్చినట్లయితే, దానిని పురాతన ఆస్తిగా పరిగణించరు. అది కూడా స్వార్జిత ఆస్తి కిందకే వస్తుంది. కుటుంబ వివాదాలు రాకుండా ఉండాలంటే, ఆస్తి స్వభావాన్ని ముందుగానే అర్థం చేసుకోవడం అవసరమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇదండీ అసలు కథ.. సింపుల్‌గా చెప్పాలంటే.. స్వార్జిత ఆస్తి అనేది పుట్టికతోనే పిల్లలకు వారసత్వంగా రాదు. పురాతన లేదా వారసత్వ ఆస్తి అనేది మాత్రం పిల్లలకు పుట్టికతోనే వస్తుంది.