
హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై గుండెల్ని పిండేసే ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దైవ దర్శనం ముగించుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ బీడీ వ్యాపారి బుల్లి రాజు కుటుంబం ఈ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైంది. యాదగిరిగుట్ట, స్వర్ణగిరి దైవ దర్శనాలకు వెళ్లి వస్తుండగా వీరి వాహనం ప్రమాదానికి గురైంది. మృతి చెందిన ఆరుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రమాద వివరాల్లోకి వెళ్తే..
వేసవి సెలవుల నిమిత్తం సిరిసిల్ల నుంచి సనత్ నగర్‌లో ఉంటున్న పెద్ద కుమారుడు శివ ఇంటికి, బుల్లి రాజు కుమార్తె శ్వేత, అల్లుడు శ్రీనివాస్ తమ పిల్లలతో కలిసి వచ్చారు. అందరూ కలిసి దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బుల్లి రాజు కుమారుడు బుల్లి శివ, ఆయన భార్య రాజేశ్వరి, మనమరాలు రిషిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అలాగే రాజు కుమార్తె శ్వేత భర్త శ్రీనివాస్, కుమారులు కృష్ణచంద్ర, మాధవ్‌లు కూడా మృత్యువాత పడ్డారు. కుమార్తె శ్వేతకు తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆమె శంషాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. రాజు చిన్న కుమారుడు శిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఆరుగురు సభ్యులను కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.