Reading Time: 2 minutes

ఒకే రోజు.. నాలుగు అగ్ని ప్రమాదాలు.. నారాయణగూడలో ఆటోలో గ్యాస్ నింపుతుండగా ఫైర్

Caption of Image.
  • రెండు ఆటోలు దగ్ధం 
  •  మరో చోట సీజ్​ చేసిన కార్లు బుగ్గి 
  •  ఓల్డ్​ సిటీ, షాద్​నగర్​లోనూప్రమాదాలు 

ఓల్డ్ సిటీ, వెలుగు: హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌‌‌‌‌‌‌‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జూ పార్క్ సమీపంలోని తాడ్‌‌‌‌‌‌‌‌బన్ ప్రాంతంలో ఉన్న ఫర్నిచర్ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న నాలుగు హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్ గోదాములకు కూడా మంటలు వ్యాపించి భారీ నష్టం వాటిల్లింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో అబ్దుల్ హై అండ్ కంపెనీ(ఫైబర్ షీట్స్, హెచ్‌‌‌‌‌‌‌‌పీ ఫ్యాబ్రికేషన్ వర్క్స్)తో పాటు సమీపంలోని హైదరాబాద్ స్టీల్ షట్టర్ హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్ గోదాముల్లో మంటలు చెలరేగాయి. చందూలాల్ బరాదరీ, రాజేంద్రనగర్, లంగర్ హౌస్, గౌలిగూడ ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

ఫైబర్ షీట్స్, ప్లైవుడ్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకుంది. నీటి బౌజర్ల నుంచి నీళ్లు సరఫరా చేస్తూ అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి తగరం వెంకన్న, కామాటిపురా సీఐ భాస్కర్​ తెలిపారు.

పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌లో రెండు ఆటోలు దగ్ధం..

నారాయణగూడ: పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌లో ఆటోకు గ్యాస్ నింపుతుండగా మంటలు చెలరేగి రెండు ఆటోలు దగ్ధమయ్యాయి. నారాయణగూడ మెట్రో స్టేషన్ కింద మార్వెల్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న హెచ్‌‌‌‌‌‌‌‌పీ పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌లో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక ఆటో పూర్తిగా దగ్ధమవగా, మరో ఆటో పాక్షికంగా కాలిపోయింది. గ్యాస్ నింపుతున్న ఎం.డి. సిరాజ్(34)తో పాటు మరో వ్యక్తి రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్​కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

సీజ్​ చేసిన రెండు కార్లు..

నారాయణగూడ పోలీస్ స్టేషన్ వద్ద గతంలో పలు కేసుల్లో సీజ్ చేసి పార్క్ చేసిన రెండు కార్లు శుక్రవారం ఉదయం అనుమానాస్పదంగా దగ్ధమయ్యాయి. మంటలు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

రియల్ ఎస్టేట్ ఆఫీసులో..

షాద్‌‌‌‌‌‌‌‌నగర్: షాద్‌‌‌‌‌‌‌‌నగర్ మున్సిపాలిటీ పరిధి చటాన్‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామ బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్న సహస్ర రియల్ ఎస్టేట్ కార్యాలయంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  దాదాపు రూ.70 లక్షల విలువైన కీలక డాక్యుమెంట్లు, ఫర్నిచర్​, ఎల్ఈడీ స్క్రీన్, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్ తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు యజమాని పాతావత్ సంతు నాయక్  చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.