Reading Time: < 1 minute

జీవో 7ను ఉపసంహరించుకోవాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

Caption of Image.

కాచిగూడ, వెలుగు:  స్టూడెంట్ల అకౌంట్లలోనే ఫీజు రీయింబర్స్​మెంట్​ జమ చేయాలని జారీ చేసిన జీవో నంబర్​ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీశ్​ ఆధ్వర్యంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలేజీ యాజమాన్యాలు ఫీజులను ముందుగానే చెల్లిస్తేనే అడ్మిషన్లు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. కోర్టు సైతం ఫీజులను విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడం బాధాకరమని, ఈ అంశాన్ని పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తావిస్తానని చెప్పారు. 

సింగిల్ బెంచ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు ఫుల్ బెంచ్‌‌‌‌‌‌‌‌కు అప్పీల్ చేయాలని సూచించారు. అంతవరకు ప్రస్తుత జీవోను నిలిపివేసి పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్​మెంట్ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘ నాయకులు నీల వెంకటేశ్, రాజేందర్, అనంతయ్య, అంజి గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, శివ కుమార్ యాదవ్, మల్లేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్​ చానల్​ విధానంలో చెల్లించాలి..

మెహిదీపట్నం: జీవో నంబర్ 7ను సవరించి గ్రీన్ చానల్ విధానంలో విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ కోరారు. శుక్రవారం మెహిదీపట్నంలో స్టూడెంట్స్​తో కలిసి ర్యాలీ నిర్వహించి నల్ల కండువాలతో నిరసన తెలిపారు. అనంతరం జీవో కాపీలను చించేశారు. స్పష్టత లేని జీవో 7 వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.