
- స్కీంను నీరుగార్చేందుకే జీవో నం.7: జాజుల
బషీర్‌బాగ్,వెలుగు : పేద విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆనాడు రాజశేఖర్ రెడ్డి పేదల చదువు కోసం ఫీజుల స్కీమ్‌ను తెస్తే.. ఈనాటి కాంగ్రెస్ దాన్ని రద్దు చేయాలని చూస్తోంది”అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతోందని, బడుగు బలహీన వర్గాల పిల్లలను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పథకాన్ని నీరుగార్చడానికే ప్రభుత్వం జీవో నం.7ను తెచ్చిందని, విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తామనడం అవివేకమన్నారు. ‘‘ప్రభుత్వానికి దమ్ముంటే పథకాన్ని రద్దు చేస్తున్నామని ధైర్యంగా ప్రకటించాలి.. అంతే తప్ప ఈ దొడ్డిదారి పద్ధతులు వద్దు” అని హెచ్చరించారు. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే జూన్ నెలలో లక్ష మంది విద్యార్థులతో హైదరాబాద్‌ను బంద్‌చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ అన్యాయంపై తాము న్యాయపోరాటం చేస్తామని, కోర్టుకు వెళతామని తెలిపారు.