
రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను మాత్రమే కాకుండా.. మొత్తంగా ప్రతిపక్షాన్నే బలహీనపరుస్తున్నారు. రాష్ట్రానికో విధానం, గంటకో మాటతో రాహుల్ తీరు ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఓవైపు జాతీయస్థాయిలో ఇండి కూటమి కట్టిన రాహుల్.. రాష్ట్రాల ఎన్నికల్లో మిత్రపక్షాలపైనే తొడకొడుతూ.. బీజేపీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. ఏదోలా మిత్రపక్షాలతో కాంప్రమైజ్ కాకుండా.. కూటమికి విలువ లేకుండా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి కాంగ్రెస్ సరైన ప్రత్యర్థి కాదని తెలిసీ.. వాస్తవ బలంపై సరైన అంచనా లేకుండా.. గందరగోళ విధానాలతో.. మిత్రులకు చిక్కులు తెచ్చి పెడుతున్నారు.
రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా సరైన ప్రభావం చూపడం లేదనేది పాత మాట. కానీ ఇప్పుడు రాజకీయంగానూ తీవ్ర గందరగోళానికి కారణమౌతున్నారనేది కొత్త మాట. మొన్నటిదాకా రాహుల్ తీరుతో కాంగ్రెస్ మాత్రమే తల పట్టుకునేది. కానీ ఇప్పుడు మొత్తం ఇండి కూటమి పక్షాలన్నీ రాహుల్ వైఖరి చూసి.. అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
రాహుల్ గాంధీ మొన్నటిదాకా బీజేపీపై ఒంటరి పోరాటం చేస్తున్నామంటారు. కలిసిరావడం లేదని మిగతా ప్రతిపక్షాల్ని తప్పుబట్టారు. కానీ తీరా ఇండి కూటమి ఏర్పాటయ్యాక.. ఆయనే పనిగట్టుకుని మిత్రధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. అసలు రాహుల్ ఎప్పుడేం మాట్లాడతారో.. ఎప్పుడు ఏ రాగం ఎత్తుకుంటారో తెలియక విపక్షాలన్నీ అయోమయంలో పడిపోతున్నాయి. ఎక్కువ మాట్లాడితే బీజేపీతో పోరాటం కంటే.. రాహుల్ వైఖరిని అర్థం చేసుకోవటమే కష్టంగా ఉందని ఇండి కూటమి పార్టీలన్నీ వాపోతున్నాయి. ఇండి కూటమి ఏర్పాటు దగ్గర్నుంచి జరిగిన రాష్ట్రాల ఎన్నికలు చూస్తే.. రాహుల్ కొన్నిచోట్ల దగ్గరుండి మరీ మిత్రుల ఓటమికి దారితీశారు. అదేమంటే తమకు గౌరవం ఇవ్వలేదు కాబట్టే.. విడిగా పోటీచేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. కానీ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ ఏమిటనే వైఖరిని ఎలా సమర్థించుకుంటారనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోతోంది. రాహుల్ తీరు కారణంగానే అసలు ఎన్నికల అజెండా లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ చాలా తేలికగా గెలుపు ఉట్టి కొడుతోంది.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ తీరు చూస్తే.. ఆయన ప్రతిపక్షానికి ఎలా సమస్యలు సృష్టిస్తున్నారో తేలికగా అర్థమవుతుంది. బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఇండి కూటమి భాగస్వాములు. అలాగే కేరళలో విజయన్ కూడా ఇండి కూటమిలో భాగస్వామే. వీరంతా కలిసి ఇటీవలే పార్లమెంట్‌లో కలిసికట్టుగా పోరాడి.. మహిళా రిజర్వేషన్ బిల్లును తిప్పికొట్టి.. కేంద్రానికి షాకిచ్చారు. హమ్మయ్య ప్రతిపక్ష కూటమి ఎట్టకేలకు ఒక్కతాటిపైకి వచ్చిందని ఆ పార్టీల క్యాడర్ సంబరం కొద్దిరోజులకే ఆవిరైంది. ఇలా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం మొదలైందో లేదో.. అలా రాహుల్ తనకు మాత్రమే తెలిసిన గందరగోళ విద్యను మరోసారి బయటకు తీశారు. ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న మమత పార్టీ, బీజేపీ ఒకటేనని బెంగాల్లో రాహుల్ చేసిన ప్రచారం చూసి.. దీదీకి దిమ్మ తిరిగింది. అలాగే కేరళలోనూ రాహుల్ విజయన్‌పై దుమ్మెత్తిపోశారు. ఇంకా మాట్లాడితే బీజేపీ విమర్శించని కోణాల్లోనూ రాహుల్ మిత్రపక్షాల్ని దులిపేశారు. దీంతో బీజేపీ కూడా తమ మాటలు నమ్మక్కర్లేదు.. రాహుల్ మాటలు వినండంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేసేదాకా పరిస్థితి చేయిదాటింది. ఫలితాలు ఏమాత్రం అటూఇటూ అయినా.. దానికి రాహుల్ తీరే కారణమని మిత్రపక్షాలు ముందే హెచ్చరించేదాకా పరిస్థితులు విషమించాయి. అయినా సరే రాహుల్ ఎక్కడా తాను చేసింది పొరపాటనో, గ్రహపాటనో ఫీల్ కావటం లేదు. పైగా పొత్తు జాతీయ స్థాయిలో మాత్రమే అని మీరే అన్నారు కదా అని మిత్రుల్ని ఎద్దేవా చేస్తున్నారు. దీంతో రాహుల్ ఇలా చేస్తే ఎలాగని కాంగ్రెస్ పార్టీ కూడా తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
రాహుల్ మిత్రపక్షాలన్నింటితోనూ ఒకే తీరుగా ఉండటం లేదు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో ఇష్టం లేకున్నా స్టాలిన్‌తో కలిసి నడిచిన రాహుల్.. బెంగాల్లో మాత్ర మమతకు ఖో చెప్పారు. నిజంగా సీట్లు, పరస్పర గౌరవమే ప్రాతిపదిక అయితే.. తమిళనాడులో ఏం దక్కిందని పొత్తు కొనసాగించారో రాహుల్ చెప్పాలి. కానీ ఆయన మాత్రం ఎవరికీ వివరణలు ఇవ్వరు. తనకు తోచినట్టు చేస్తూ.. మీ చావు మీరు చావండని మిత్రుల్ని గాలికొదిలేస్తున్నారు. ఓవైపు బెంగాల్లో బీజేపీ, మమత మధ్య గట్టిపోటీ నెలకొందని తెలిసి కూడా కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం ఏమిటని టీఎంసీ నిలదీసింది. ఒక్క శాతం ఓటు కూడా కీలకమే అయిన స్థితిలో.. రాహుల్ వేరు కుంపటితో.. కొన్ని ఓట్లు చీల్చినా.. తమ పుట్టి మునగదని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించింది. కానీ రాహుల్ మాత్రం ఎప్పటిలాగే ఈ దుస్థితికి మీరే కారణం అని తేల్చిచెప్పేశారు.
ఇక కేరళ విషయానికొస్తే.. అక్కడ వామపక్షాలతో చారిత్రక వైరాన్ని దృష్టిలో పెట్టుకున్న రాహుల్.. ప్రస్తుత ఇండి కూటమికి తిలోదకాలిచ్చేశారు. అదేమంటే కేరళలో తామే చాలా బలంగా ఉన్నామని లెక్చర్ దంచారు. ఇక్కడ బలాబలాల సంగతి పక్కనపెడితే.. బీజేపీ వ్యతిరేక పోరాటం అంటూ ఒకటుందని అయినా రాహుల్‌కు గుర్తుందా అనేది అసలు ప్రశ్న. ఇండి కూటమి ఏర్పాటు అసలు లక్ష్యమే బీటలు వారేలా ప్రవర్తిస్తున్న రాహుల్.. తలాతోకా లేని విధానాలతో ప్రతిపక్షాన్ని హోల్‌సేల్‌గా బలహీనపరుస్తున్నారనడంలో సందేహం లేదు.
రాహుల్ తీరు ఇదేదో కొత్తగా బయటపడింది కాదు. గతంలో హరియాణా, ఢిల్లీ ఎన్నికల్లోనూ ఆప్‌కు ఇలాగే షాకిచ్చారు రాహుల్. ఢిల్లీ ఎన్నికల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ అధికారంలోకి రాకూడదన్నంత కసిగా ప్రచారం చేశారు. పనిలోపనిగా తమను గద్దె దించే కేజ్రీవాల్ రాజకీయంగా ఎదిగారని పాతగాయాన్ని తట్టిలేపారు. పాత విషయాలన్నీ ఇంత గుర్తుపెట్టుకున్నరాహుల్.. ప్రస్తుతం కేజ్రీవాల్ బలహీనపడితే.. ఇండి కూటమికి ఎదురుదెబ్బ అనే వాస్తవాన్ని విస్మరించారు. దీంతో ఢిల్లీ ఇండి కూటమి చేజారింది. ఆ తర్వాత హరియాణాలోనూ సేమ్ సీన్ రిపీటైంది. అక్కడ ఆప్‌తో పంతానికి పోయి.. సీట్ల సర్దుబాటులో చిక్కుముడి వేసింది కాంగ్రెస్. దీంతో అక్కడ కూడా ప్రత్యర్థి నెత్తిన పాలు పోసినట్టైంది. ఇక యూపీ ఎన్నికల్లో రాహుల్ తీరుపై సాక్షాత్తూ మిత్రుడు అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. కూటమి పేరు చెబుతూ.. మిత్రధర్మాన్ని పాటించకపోతే ఎలాగని అఖిలేష్ నిలదీసినా.. రాహుల్ షరామామూలుగా బదులు చెప్పలేదు. చివరకు ఫలితాలు చూస్తే.. అఖిలేష్ చెప్పినట్టుగా మిత్రధర్మం పనిచేయక.. బీజేపీకే అధికారం దక్కింది. దీంతో ఇప్పటికే రాహుల్‌ను అపహాస్యం చేస్తున్న బీజేపీకి.. మరింత పదునైన ఆయుధం చిక్కినట్టైంది. రాహుల్ ఉండగా తమకు అధికారంపై బెంగ లేదని పదేపదే చెబుతున్న కమలనాథులు.. అసలు ఇండి కూటమి ఉనికే ప్రశ్నార్థకమైందని ప్రతి రాష్ట్రంలో చెడుగుడు ఆడుకుంటున్నారు. ఈ విషయాన్ని లైట్ తీస్కుంటే పుట్టి మునుగుతుందని మిత్రులు మొత్తుకుంటున్నా.. రాహుల్ మాత్రం రాష్ట్రానికో విధానంతో.. చేజేతులా కూటమిని కూలదోసేలా కనిపిస్తున్నారు. నాకు అవసరమైతే కూటమి.. లేకపోతే వేరుకుంపటి అనే తీరుతో.. మిత్రులు కూడా విసిగిపోతున్నారు. రాహుల్ వైఖరి ఇలాగే ఉంటే.. అసలు వచ్చే ఎన్నికల నాటికి కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కివస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగలనుంది.
ఇప్పటికే రాహుల్‌కు జాతీయస్థాయిలో విధానాల విషయంలో నిలకడ లేదని, ప్రచారంలోనూ నాన్ సింక్ అంశాలు ప్రస్తావిస్తుంటారనే గొప్ప పేరుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పదేపదే రాఫెల్ జపం చేసినా ఫలితం దక్కని రాహుల్.. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. సంబంధం లేని అదానీ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో రాహుల్ ప్రచారం కారణంగా సీరియస్‌నెస్ పోతోందని స్థానిక నేతలు, క్యాడర్ తలపట్టుకున్న దుస్థితి. ఎక్కడైనా అగ్రనేతలు ప్రచారానికి వస్తే బాగుంటుందని నేతలు కోరుకుంటారు. కానీ కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మిత్రులు మాత్రం రాహుల్ ఎంత తక్కువ ప్రచారం చేస్తే అంత మంచిదని ఫిక్స్ అవుతున్నారు. అలా ఫిక్స్ అయ్యేలా తన విధానాలు, ప్రసంగాలతో భయపెడుతున్నారు రాహుల్.
దేశంలో బీజేపీకి కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయం కాదని రాహుల్‌కీ తెలుసు. అందుకే జాతీయస్థాయిలో ఇండి కూటమి కట్టారు. అలాగని కూటమి ధర్మానికి కట్టుబడకుండా.. మిత్రులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. దేశంలో ప్రస్తుతం బీజేపీ బలమైన శక్తిగా ఉంది. మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. బీజేపీకి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పేరుకి ప్రత్యామ్నాయంగా ఉన్నా.. దేశవ్యాప్తంగా కాషాయ పార్టీని ఢీకొట్టే శక్తి కానీ, సత్తా కానీ కాంగ్రెస్‌కు లేవు. కానీ ఈ విషయం తెలుసుకోవటానికి రాహుల్‌కు పదేళ్లు పట్టింది. చివరకు నానాతంటాలు పడి ఇండి కూటిమిని సాకారం చేశారు. అప్పటికీ రాహుల్ నాయకత్వానికి తాము ఒప్పుకునేది లేదని దీదీ లాంటి నేతలు కుండబద్దలు కొట్టారు. కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి మాత్రమే నాయకత్వం వహించే పార్టీ కాదని తేల్చేశారు. అయినా సరే సర్దుకుని లోక్‌సభ ఎన్నికల్లో కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీచేసిన రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్.. ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. దీంతో రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కానీ కూటమి కట్టిన అసలు లక్ష్యాన్ని రాహుల్ పదేపదే మర్చిపోతున్నారు. అంతటితో ఆగితే పర్లేదు. కానీ కాంగ్రెస్ వాస్తవ బలాన్ని కూడా తప్పుగా అంచనా వేస్తూ.. తాను గందరగోళంలో పడిపోయి.. కూటమినీ అయోమయంలోకి నెట్టేస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్ని పరిగణనలోకి తీసుకుంటే.. బెంగాల్లో కాంగ్రెస్ బలం నామమాత్రం. కానీ ఇండి కూటమి భాగస్వామి టీఎంసీ మాత్రం చాలా బలంగా ఉంది. కానీ ఆ పార్టీని ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ చూస్తోంది. అలాంటప్పుడు మిత్రుడిగా రాహుల్ ఏం చేయాలి. తన శక్తి మేరకు మిత్ర పక్షానికి మద్దతిచ్చి.. బీజేపీని నిలువరించే ప్రయత్నం చేయాలి. కానీ ఆయనేం చేశారు..? బెంగాల్ వెళ్లి మమతపై దుమ్మెత్తి పోశారు. ఇక్కడ మమతపై ప్రత్యర్థి పార్టీ బీజేపీ విమర్శలు చేయటానికి, మిత్రుడిగా ఉన్న రాహుల్ దండెత్తటానికి చాలా తేడా ఉంది. కానీ ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిన రాహుల్.. కూటమికి గండికొట్టే పని చేశారు. మమత అధికారం కోల్పోతే.. అది అంతిమంగా కూటమికి నష్టమనే దూరాలోచన చేయలేకపోయారు. కూటమి అనే దాని గురించి కానీ, పొత్తు గురించి కానీ ఆలోచన లేకుండా.. బెంగాల్లో ఎవరు గెలిస్తే నాకేంటనే ధోరణితో ముందుకెళ్లారు. ఇక అంతకంటే ముందు పొత్తు పేరుతో రాహుల్ నడిపిన ప్రహసనం అంతా ఇంతా కాదు. తనకు బలం లేదని తెలిసీ.. శక్తికి మించిన సీట్లు అడిగి.. మమత నో చెప్పేలా ప్రేరేపించారు. అదేమంటే మిత్రులకు కనీస గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. అటు మమత మాత్రం కూటమి అసలు లక్ష్యాన్ని గుర్తుచేస్తూ.. బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చేలా సీట్ల సర్దుబాటు చేయమని అడగకూడదని హితవు చెప్పారు. కానీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్టుగా రాహుల్ వ్యవహరించారు. ఇది అంతిమంగా ఎలాంటి ఫలితానికి దారితీస్తుందనేది చూడాల్సి ఉంది.
ఇక తమిళనాడులోనూ కాంగ్రెస్ బలం నామమాత్రమే. అక్కడ కూడా స్టాలిన్ దగ్గర రాహుల్ అతిగా బేరం చేశారు. కానీ ఇలా అయితే అసలు పొత్తే వద్దని స్టాలిన్ తేల్చేయడంతో.. చేసేదేం లేక ఇచ్చినన్ని సీట్లు తీసుకుని మిత్రపక్షంగా ఉన్నారు. కానీ మిత్రపక్షంగా రాహుల్ పూర్తిగా స్టాలిన్‌కు అండగా నిలబడ్డారా.. లేదా అనేదానికి తమిళనాడులో విలువ లేదు కాబట్టి.. డీఎంకే బతికిపోయిందనే జోకులు పేలుతున్నాయి.
ఇప్పుడే కాదు గతంలోనూ కాంగ్రెస్సే తమను పనిగట్టుకుని ఓడించిందని మిత్రపక్షాలు మొత్తుకున్న సందర్భాలున్నాయి. కానీ రాహుల్ మాత్రం గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోకపోగా.. అవే తప్పులు పునరావృతం చేస్తున్నారు. దీంతో రాహుల్ ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మిత్రులంతా తల పట్టుకుంటున్నారు. కూటమి ఏర్పాటైన మొదట్లో మిత్రులు గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నా తాము సహిస్తున్నామని ఇదే రాహుల్ గాంధీ డైలాగులు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనే చేజేతులా కూటమిని బలహీనపరిచేలా వ్యవహరిస్తూ.. అస్పష్టమైన విధానాలతో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ తలతిక్క నిర్ణయం తీసుకోవటం.. దానికి మరో అర్థం పర్థం లేని సమర్థింపు వెతుక్కోవటం రాహుల్‌కు అలవాటుగా మారిపోయింది. అంతిమంగా కిందపడ్డా తనదే పైచేయి అనే తీరుతో.. సొంత పార్టీని కూడా నలుగురిలో నవ్వులాటకు గురిచేస్తున్నారు.
వరుస ఓటముల తర్వాత ఏ పార్టీలో అయినా కసి పెరుగుతుంది. ఏ నాయకుడిలో అయినా పట్టుదల వస్తుంది. కానీ రాహుల్ మాత్రం స్వీయ తప్పిదాలతో ఓడిపోతున్నా.. మళ్లీ మళ్లీ అంతకు మించిన తప్పులు అంతే ఉత్సాహంగా చేస్తూ.. మిత్రులతో పాటు సొంత పార్టీ నేతల్నీ అవాక్కయ్యేలా చేస్తున్నారు. రాహుల్ ధోరణేంటో తమకే అంతుబట్టడం లేదని.. 24 గంటలూ ఆయన్ను వెన్నంటి ఉండే నేతలే అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్న దుస్థితి. రాహుల్ కు తెలియదు. ఎవరైనా చెప్పినా వినరని సీనియర్లు ఎప్పుడో చెప్పేశారు. కానీ పైకి మాత్రం కార్యకర్తల వాదన కూడా వింటున్నట్టుగా పోజిచ్చే రాహుల్.. తీరా రంగంలోకి దిగాక.. తన అసలు రంగును బయటపెడుతూ.. అదే తమాషా చేస్తున్నారు.
బీజేపీని ఎదుర్కునేముందు.. సొంత పార్టీని సంస్కరించుకోవాలి.. బలాబలాలపై కొత్తగా అంచనాలు వేసుకోవాలనే హితవును రాహుల్ ఏనాడూ చెవికెక్కించుకోలేదు. పైగా అంతో ఇంతో బలం ఉన్న రాష్ట్రాలనూ, అసలు ఉనికే లేని రాష్ట్రాలను ఒకే గాటన కడుతున్నారు. రాహుల్ కు ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో తెలియక కాంగ్రెస్ నేతలు, ఇండి కూటమి మిత్రులు తలలు పట్టుకుంటున్నారు. అదేమంటే రాహుల్ దగ్గర కొన్ని స్టాక్ డైలాగులు రెడీగా ఉంటాయి. కాంగ్రెస్ గతకాలపు ఘనచరిత్రలో తనకు తెలిసిన కొన్ని విషయాలు పదేపదే వల్లెవేస్తారు. మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండంటూ.. విసిగిస్తారు. అంతేకానీ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడరు. వ్యూహరచన చేయరు. దీంతో బీజేపీకి కాగల కార్యం కాంగ్రెస్సే చేస్తున్నట్టుగా ఉంటోందని మిత్రులు ఈసడిస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయం చాలా మారిపోయింది. కానీ రాహుల్ మాత్రం ఏమీ మారడం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే ఉంటున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఒకే తీరుగా ఉంటున్న రాహుల్.. విధానాల విషయంలో మాత్రం తీవ్ర గందరగోళాన్ని ప్రదర్శిస్తున్నారు. నేతలేం చేయాలో, క్యాడర్ ఎలా పోరాడాలో చెప్పే రాహుల్.. తానేం చేయాలో మాత్రం ఎక్కడా స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేయడం లేదు. పైగా రోజురోజుకీ మరింత కన్ఫ్యూజన్ మాస్టర్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అటువైపు మోడీ, అమిత్ షా ఏ స్థాయికైనా వెళ్లి యుద్ధం చేయగలరు. కానీ ఇటువైపు రాహుల్ మాత్రం రోజుకో విధానం, గంటకో మాటతో.. వారి ముందు నిలబడలేక తేలిపోతున్నారు. తనతో పాటు మిత్రుల్ని కూడా నిండా ముంచేస్తారనే భయాలకు తావిస్తున్నారు.
కాంగ్రెస్ కు చారిత్రకంగా బలం ఉంది. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలహీనంగా ఉంది. కానీ ఈ వాస్తవం రాహుల్ తలకెక్కటం లేదు. కేవలం మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తనకు అసలు ఉనికి లేని రాష్ట్రాల్లోనూ విడిగా పోటీచేస్తూ.. పరోక్షంగా బీజేపీకి లబ్ధి కలిగిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరానికి నాయకత్వం వహించాలని ఉబలాటపడుతున్న రాహుల్.. తన వైఖరితో మాత్రం ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారు. ఓవైపు అధికారంపై ఆశ లేదంటారు. మరోవైపు రాష్ట్రాల్లో కొన్ని సీట్ల కోసం మిత్రులతో తగవు పెట్టుకుంటారు. రాహుల్ మాటల్లో ఒకదానితో మరోదానికి పొంతన లేదని మొన్నటిదాకా బీజేపీ మాత్రమే అనేది. ఇప్పుడు మిత్రులూ అంటున్న దుస్థితి. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి.. ఢిల్లీలో ఓమాట.. ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు మరో మాట చెప్పిన చరిత్ర కూడా రాహుల్‌కి ఉంది. మొన్నటి బీహార్ ఎన్నికలే ఇందుకు పెద్ద నిదర్శనం. అక్కడ పేరుకి తేజస్వితో పొత్తు పెట్టుకున్నా.. సీట్ల సర్దుబాటును త్వరగా తేల్చుకండా చివరిదాకా నాన్చారు రాహుల్. చివరకు తేజస్వి ఢిల్లీ వచ్చినా కూడా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. అంతా అయిపోయిందన్నాక కూడా కొన్ని సీట్లలో ఆర్జేడీపై స్నేహపూర్వక పోటీకి కాంగ్రెస్ సిద్ధం కావడం ఇండి కూటమికి షాకిచ్చింది. ఆ తర్వాత వారిని ఉపసంహరించుకునేలా చేయటానికి తేజస్వి నానాపాట్లు పడ్డారు. అయినా సరే కొందరు ససేమిరా అనడంతో ఆ మేరకు నష్టం తప్పలేదు. ఇదంతా రాహుల్ చలవేనని తేజస్వి అనుకుంటే.. అది ఆయన తప్పు కాదు.
కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితిని జీర్ణించుకోలేకపోవటమే రాహుల్ అసలు సమస్య అనే అంచనాలూ ఉన్నాయి. ఆ అసహనంతోనే ఆయన నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ.. తోచినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. రాహుల్ ఎంతసేపూ కాంగ్రెస్ పాత ఘనతల గురించే మాట్లాడుతారు కానీ.. తాను రంగంలోకి దిగిన తర్వాత ఏ రాష్ట్రంలో పార్టీ బలం పెరిగింది.. ఎక్కడ తగ్గిందనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి రాహుల్ మాట్లాడే తీరు చూస్తే.. తాము ప్రతిపక్షంలో ఉన్నామా.. అధికారంలో ఉన్నామా అనే అనుమానం వస్తుందని కాంగ్రెస్ నేతలే వాపోయే దుస్థితి. రాహుల్ కేంద్రంగా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్‌కు.. ఆయన తీరుతో తలకొట్టేసినట్టుగా ఉంటోంది. ఓవైపు విపక్ష కూటమి నేతగా ఆయన్ను ప్రొజెక్ట్ చేయాలని తాము చూస్తుంటే.. రాహుల్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే తీరుగా రాష్ట్రానికో విధానం అవలంబించటం.. ఆ పార్టీకి షాకిస్తోంది. కొన్నాళ్లు ఇండి కూటమిలో కొన్ని పార్టీలు కూడా రాహుల్‌ను పెద్దన్నగా గౌరవించాలనే భావనతో ఉన్నాయి. కానీ రోజురోజుకీ రాహుల్ ప్రదర్శిస్తున్న రాజకీయ ఊసరవెల్లి నైజం వాటిక్కూడా చిరాకు తెప్పిస్తోంది. అంతకుముందు వేర్వేరు ఓటుబ్యాంకులున్న పార్టీలన్నింటినీ ఓ వేదిక పైకి తెచ్చి.. వాటికి ఉమ్మడి ఓటుబ్యాంకు ఏర్పడేలా చేసింది రాహులే. మళ్లీ ఆయనే పనిగట్టుకుని పరస్పర పోటీని ప్రోత్సహిస్తూ.. విపక్షాల ఓటుబ్యాంకుకు తూట్లు పొడుస్తున్నారు. ఇది ప్రత్యక్షంగా మిత్రులకు నష్టం చేస్తుంటే.. పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తోంది. ఈమధ్య రాహుల్ తనకి సడెన్‌గా జ్ఞానోదయం అయినట్టుగా కూడా మాట్లాడారు. గతంలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు జరిగాయని, కానీ ఇకపై అలా జరగదని భరోసా ఇచ్చారు. అది నమ్మిన కాంగ్రెస్ శ్రేణులకు.. ఆ తర్వాత రాహుల్ తీరు చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఇక్కడ కాసేపు కాంగ్రెస్ సంగతి పక్కనపెట్టి.. మళ్లీ కూటమి దగ్గరకు వద్దాం. ఏ కూటమి నిలబడాలన్నా నమ్మకమే ప్రధానం. కానీ రాహుల్ అయోమయ విధానాలతో.. ఆ నమ్మకమే లేకుండా పోతోంది. దీంతో ఏ క్షణం ఏ మిత్రుడికి కోపం వస్తుందో.. అది అంతిమంగా ఎవరి పుట్టి ముంచుతుందో అని కూటమి పార్టీలన్నీ గుబులుగా ఉంటున్నాయి.
ఎక్కడైనా ప్రతిపక్ష నేత ప్రచారానికి వస్తే బాగుంటుందని కోరుకోవటం అరుదు. కానీ రాహుల్ వైఖరి పుణ్యమా అని బీజేపీ మాత్రం అదే కోరుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్న మాటలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మోడీ ప్రచారం లేకపోయినా.. రాహుల్ ప్రచారం ఉంటే అదే పదివేలంటారు కమలనాథులు. అంతేకాదు ఏ రాష్ట్రంలో అయినా గెలుపుపై చిన్న అనుమానం కలిగినా.. రాహుల్ ఒక్కసారి వస్తే.. అది పటాపంచలై.. గెలుపుపై ధీమా పెరిగిపోతుందని కూడా నమ్మకంగా చెబుతారు. ఇలా తన ప్రచారంతో ప్రత్యర్థికి ఎక్కడలేని విశ్వసాన్నిస్తున్న రాహుల్.. సొంత పార్టీకి, నమ్ముకున్న మిత్రులకు మాత్రం భరోసా ఇవ్వకపోగా.. ఏదో రకంగా తిరకాసు పెడుతున్నారు. ఇలాగైతే ఎలాగని కొందరు మిత్రులు.. రాహుల్‌ను వ్యక్తిగతంగా కలిసి చెప్పినా.. ఇప్పటికింతే .. తర్వాత చూద్దాం అనో.. లేదంటే అయ్యో అదేదో తెలియకుండా పొరపాటు జరిగిపోయింది.. మరోసారి అలా జరగదులే అనే ఉత్తుత్తి మాటలు చెబుతారు. కానీ మళ్లీ మరోచోట ఎన్నికలొస్తాయి. అక్కడ మళ్లీ సరికొత్త విధానాన్ని తెరపైకి తెస్తారు రాహుల్. చివరకు రాహుల్ చెప్పడం అనవసరమన, ఆయన తీరుకు అనుగుణంగా మనమే మారాలని కొందరు మిత్రులు ఫిక్సైపోయారు.
రాహుల్ గందరగోళ వైఖరి గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. పదేళ్లు కష్టపడి కూటమి కట్టిన రాహుల్.. ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలొచ్చినప్పుడల్లా.. ఒక్కో మిత్రుడిని దూరం చేసుకుంటూ వచ్చారు. ఢిల్లీలో ఆప్‌ను, యూపీలో ఎస్పీని దూరం చేసుకున్న రాహుల్.. ఇప్పుడు బెంగాల్లో మమతను దూరం చేసుకున్నారు. చివరకు కేరళలో లెఫ్ట్‌కు కూడా ఖో చెప్పారు. రాహుల్ ప్రస్తుత తీరుతో మళ్లీ పార్లమెంట్‌లో విపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా.. అంటే సందేహమే అనే పరిస్థితి. మొత్తం మీద రాహుల్ తన గందరగోళాన్ని పార్టీకి, కూటమికి హోల్‌సేల్‌గా అంటగడుతున్నారనడంలో సందేహమే లేదు. రాహుల్ వైఖరి చూసి విసిగిపోతున్న మిత్రులు.. ఏం చేస్తే ఈయన మారతారనే ఆలోచన కూడా వదిలేసి.. ఆయన్ను అలా వదిలేసి.. మన సంగతి మనం చూసుకుందాం అనుకుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి. అలా జరగకూడదని కాంగ్రెస్ బలంగా కోరుకుంటున్నా.. రాహుల్ తీరు గుర్తొచ్చినప్పుడల్లా.. బలవంతపు సంసారం ఎంతకాలం నడుస్తుందనే అనుమానం వచ్చి.. దిగాలు పడుతోంది.
ఇక కాసేపు రాజకీయం వదిలేసి.. పార్లమెంట్‌లో రాహుల్ తీరు గురించి మాట్లాడుకుంటే.. అక్కడా అంతే. అంతలోనే ప్రధాని మోడీపై, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే రాహుల్.. మళ్లీ నాలుగు రోజుల పాటు మౌనాన్నే ఆశ్రయిస్తారు. ఓవైపు ఇండి కూటమి అంతా ఓ మాటనుకుని.. బీజేపీపై ఎదురుదాడి చేస్తుంటే.. రాహుల్ మాత్రం హఠాత్తుగా తేడాగా మాట్లాడి.. సొంత పక్షానికే షాక్ ఇస్తారు. ఇలా రాహుల్ తీరు ఇంతింతకాదయా అని కాంగ్రెస్ పార్టీ, కూటమి మిత్రులు ప్రస్తుతానికి సరిపెట్టుకుంటున్నారు. కానీ కొందరు మిత్రులు మాత్రం రాహుల్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటమే లక్ష్యం అని చెప్పే రాహుల్.. సొంతగా ఆ పని చేయలేకపోగా.. చివరకు ఆ పనిలో ఉన్న మిత్రుల ముందరి కాళ్లకు బంధాలు వేసేలా ప్రవర్తించడం.. ఎవరికీ నచ్చటం లేదు. రాహుల్ ఇదే తీరుగా రాష్ట్రానికో విధానంతో.. తలాతోకా లేని నిర్ణయాలతో రాజకీయాల్లో కొనసాగితే.. ఇక ప్రత్యర్థులు విజయం కోసం పెద్ద కష్టపడాల్సిన పనే ఉండదనండలో సందేహం లేదు.