
- గత ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసింది
- మా సర్కారు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నది
- పీజేఆర్ పేరు మీద వచ్చే ఏడాది నుంచి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇస్తామని వెల్లడి
- రవీంద్రభారతిలో మే డే వేడుకలు
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో హమాలీ కార్మికుల సంక్షేమం కోసం త్వరలోనే ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్ వర్కర్ల తరహాలోనే హమాలీలకు కూడా సామాజిక భద్రత, వైద్య సదుపాయాల కల్పనకు విధివిధానాలు రూపొందిస్తున్నట్టు చెప్పా రు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో కార్మికశాఖ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన చీఫ్ గెస్ట్‌గా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా కార్మికులకు ‘శ్రమశక్తి’ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాహుల్‌గాంధీ హామీ మేరకు మొదటిసారి చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. దీంతో గిగ్, డెలివరీ కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తుందన్నారు.
దివంగత కార్మిక నేత పి.జనార్ధన్ రెడ్డి వంటి గొప్ప నాయకుల స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మిక నాయకత్వానికి గౌరవం కల్పించే దిశగా పీజేఆర్ పేరు మీద వచ్చే ఏడాది నుంచి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రారంభించనున్నట్టు మంత్రి ప్రకటించారు. సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ అయిన పెన్షన్ పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కేంద్ర కార్మికమంత్రిగా తన తండ్రి వెంకటస్వామి (కాకా) చేసిన సేవలను కొనసాగిస్తానని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసిందని, తమ ప్రభుత్వం మాత్రం కార్మిక సంఘాలతో చర్చిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నదని మంత్రి వెల్లడించారు.
- కార్మికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట
కార్మికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్టు మంత్రి వివేక్ తెలిపారు. శంషాబాద్, రామగుండం ప్రాంతాల్లో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రులను, మహబూబ్‌నగర్‌లో 30 పడకల ఆస్పత్రిని త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. లింగంపల్లిలో కూడా సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు.
కార్మికుల పిల్లలకు ఏటీసీల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర కార్మికులకు విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టాంకామ్ సంస్థ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో కార్మికుల కోసం విదేశీ భాషాశిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గిగ్ కార్మికులు గార్లపాటి శశిధర్ రెడ్డి, ధరావత్ మహేశ్ కుటుంబాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించారు.
- సింగరేణి సంస్థను కాపాడింది కాకానే: వినోద్
కాకా పట్టుబట్టి రూ.650 కోట్లు మంజూరు చేయించి సింగరేణి సంస్థను బీఐఎఫ్ఆర్ నుంచి కాపాడారని ఎమ్మెల్యే గడ్డం వినోద్గుర్తు చేశారు. సింగరేణితో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరేలా పీఎఫ్ స్కీమ్ తీసుకురావడంలో కాకా కీలక పాత్ర పోషించారని వివరించారు. కార్మికుల హక్కుల కోసం, వారి సౌకర్యాల మెరుగుదల కోసం తమ కుటుంబం ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు.
- జూన్ 2న ‘ప్రభాతభేరి’ : మంత్రి జూపల్లి
సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఎన్ని చేసినా తక్కువేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఏ రంగంలోనైనా శ్రమించే వ్యక్తిని తక్కువ చేసి చూడకూడదని, చేసే పనిని బట్టి గౌరవాన్ని నిర్ణయించవద్దన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తెచ్చిన సీఎంకు, కార్మిక శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక రుగ్మతలను రూపుమాపడం ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు జూన్ 2న ‘ప్రభాతభేరి’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
- సింగరేణి కార్మికుల పెన్షన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తం : ఎంపీ వంశీకృష్ణ
పార్లమెంట్‌లో ఇప్పటికీ తన తాత కాకా వెంకటస్వామి సేవలను గుర్తుచేసుకుంటారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. సింగరేణి కార్మికుల కోసం కాకా చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. సింగరేణి సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అండగా నిలబడ్డారని, కార్మికుల కోసం పెన్షన్ సదుపాయాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు నెలకు కనీసం రూ.10 వేల పెన్షన్ వచ్చేలా పార్లమెంట్‌లో పోరాడుతానని అన్నారు. కార్మికుల సమస్య ఏదైనా సరే పార్లమెంట్‌లో గళం వినిపిస్తానని హామీ ఇచ్చారు.