Reading Time: 2 minutes

ఇరాన్ వార్ టర్మినేషన్ కు ట్రంప్ యోచన… యుద్ధానికి కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండా ఎత్తుగడ

Caption of Image.

వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా ఒక కీలక రాజకీయ, చట్టపరమైన వివాదం ముందుకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం “యుద్ధం ముగిసింది” అనే కొత్త వాదనను తీసుకువచ్చి.. కాంగ్రెస్ అనుమతి అవసరాన్ని తప్పించుకోవాలని చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం (వార్​పవర్​ రెజల్యూషన్​1973).. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు కేవలం 60 రోజుల వరకు మాత్రమే విదేశాలపై సైనిక చర్యలు చేపట్టవచ్చు. 

ఆ గడువు ముగిసిన తర్వాత సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి లేదా కాంగ్రెస్ నుండి అధికారిక అనుమతి పొందాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌‌‌‌పై దాడులు ప్రారంభించాయి. ఈ 60 రోజుల గడువు మే 1వ తేదీతో ముగిసింది. అయితే, ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ కారణంగా ‘యుద్ధం ముగిసిందని’ ట్రంప్​ప్రభుత్వం వాదిస్తోంది. అప్పటి నుంచి అమెరికా సైన్యానికి, ఇరాన్‌‌‌‌కు మధ్య నేరుగా కాల్పులు జరగలేదు. యుద్ధం ఆగిపోయింది కాబట్టి, 60 రోజుల ‘క్లాక్’ కూడా ఆగిపోయిందని యుద్ధ వ్యవహారాల కార్యదర్శి పీట్ హెగ్సెత్ సెనేట్‌‌‌‌ కు తెలిపారు. దీనివల్ల కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండానే భవిష్యత్తులో మళ్లీ దాడులు చేసే వెసులుబాటు వైట్ హౌస్‌‌‌‌కు కలుగుతుంది. 

అయితే, ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ వాదనను డెమొక్రాట్లు, కొంతమంది రిపబ్లికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సెనేటర్ టిమ్ కైన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చెబుతున్న ఈ కొత్త వాదనకు ఎటువంటి చట్టపరమైన మద్దతు లేదని విమర్శించారు. సెనేటర్ సుసాన్ కాలిన్స్ స్పందిస్తూ.. “60 రోజుల గడువు అనేది కేవలం సూచన కాదు. అది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన” అని పేర్కొన్నారు. 

ట్రంప్ మెంటల్ కండీషన్ బాగుందా?

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌‌‌‌సెత్‌‌‌‌, డెమొక్రాట్ ఎంపీ సారా జాకబ్స్ మధ్య కాంగ్రెస్‌‌‌‌(పార్లమెంట్)లో  జరిగిన వాగ్వాదం చర్చనీయాంశమైంది. శుక్రవారం రక్షణ కమిటీ సమీక్షలో  సారా మాట్లాడుతూ.. అర్ధరాత్రి వేళల్లో ట్రంప్ సోషల్ మీడియా పోస్టులను ప్రస్తావించారు. ఇరాన్ నాగరికతే అంతమైపోతుందంటూ చేస్తున్న హెచ్చరికలు ఆయన మెంటల్ ఇన్‌‌‌‌స్టెబిలిటీకి నిదర్శనమని ఆరోపించారు. 

అసలు కమాండర్-ఇన్-చీఫ్‌‌‌‌ బాధ్యతలకు ట్రంప్  తగిన మానసిక  ఆరోగ్యంతోనే ఉన్నారా?” అని నిలదీశారు. అయితే, ఈ ప్రశ్నపై రక్షణ మంత్రి హెగ్‌‌‌‌సెత్‌‌‌‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా.. గత అధ్యక్షుడు జో బైడెన్ విషయంలో ఇవే ప్రశ్నలు ఎందుకు అడగలేదని ఎదురుదాడికి దిగారు.  
 

©️ VIL Media Pvt Ltd.