Reading Time: < 1 minute

అల్లుడి దాడిలో అత్త మృతి.. హైదరాబాద్‌‌ శివారు మేడిపల్లి పీఎస్‌‌ పరిధిలో ఘటన

Caption of Image.

మేడిపల్లి, వెలుగు : ఓ వ్యక్తి తన అత్తను హెల్మెట్‌‌తో కొట్టడంతో ఆమె బైక్‌‌పై నుంచి కిందపడి చనిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌‌ శివారులోని మేడిపల్లి పీఎస్‌‌ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెంగిచర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ (39)కు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న కూతురు కావ్య గతేడాది కరీంనగర్‌‌ జిల్లా చందన్‌‌పూర్‌‌ గ్రామానికి చెందిన కర్రు స్నేహిత్‌‌ను ప్రేమించి పెండ్లి చేసుకుంది. గత నెల 28న అరుణ తన కూతురు కావ్యకు ఫోన్‌‌ చేసి ఇంటికి పిలిచింది. 29న చెంగిచర్లకు వచ్చిన స్నేహిత్‌‌ను తన అత్త అరుణను బైక్‌‌పై ఎక్కించుకొని వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత స్నేహిత్‌‌ తన భార్య కావ్యకు ఫోన్‌‌ చేసి.. ‘మీ అమ్మకు ఫిట్స్‌‌ వచ్చి కిందపడడంతో హాస్పిటల్‌‌కు తీసుకెళ్లాను’ అని చెప్పాడు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ అరుణ గురువారం సాయంత్రం చనిపోయింది. ఇదిలా ఉండగా.. స్నేహిత్‌‌ ప్రవర్తనపై అనుమానం వచ్చిన కావ్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చెంగిచర్ల ఆర్టీసీ కాలనీలోని హనుమాన్‌‌ ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా స్నేహిత్‌‌ అరుణతో గొడవపడి తన హెల్మెట్‌‌తో కొట్టడంతో ఆమె రన్నింగ్‌‌ బైక్‌‌పై నుంచి కింద పడి గాయపడినట్లు  తేలింది.

©️ VIL Media Pvt Ltd.