Reading Time: 3 minutes

ల్యాండ్ లైన్ టెలిఫోన్‌ను ‘అది ఉన్నవారి కుక్క / ఉన్నచోటనే మొరుగుతుంది’ అని అలిశెట్టి ప్రభాకర్ రాశాడు. కాలుపై కాలు వేసుకొనే సోఫాలో దర్జాగా మాట్లాడేవారికి తప్ప సామాన్యులకు అది అంతగా ఉపయోగపడిన దాఖలు లేవు. నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కృత్రిమ మేధకు కూడా ఆ కవి పంక్తులు సరిపోతాయనవచ్చు. ఈ సాంకేతిక మేధస్సువల్ల పారిశ్రామికవేత్తలకు పని సులువు, లాభాల వృద్ధి ఉంటుంది. ఉద్యోగులను తగ్గించుకున్నా.. పరిశ్రమల్లో పనులు చకచకా సాగడానికి ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఢిల్లీ కేంద్రంగా నాలుగు రోజులపాటు కృత్రిమమేధపై విస్తృతమైన చర్చలతో ఎఐ ఇంపాక్ట్ సమిట్ జరిగింది. దేశదేశాల ప్రముఖులు, కంపెనీ యజమానులు, సిఇఒల సమక్షంలో రంగరంగ వైభవంగా ఈ సదస్సు జరిగింది. అందులో పాల్గొన్నవారంతా కంపెనీ యజమానులు, దేశాల ప్రతినిధులే. అందరూ తయారీదారులే తప్ప వినియోగదారులొక్కరు లేరు. అంతా వన్ సైడ్ ప్రహసనాలే.

ఎఐ విషయంలో పారిశ్రామికవేత్తల సంబరాలు ఒకవైపు అయితే సామాన్యుల ఆందోళనలు మరోరకంగా ఉన్నాయి. దీని రాక కారణంగా మానవాళిని పట్టి పీడిస్తున్న భయాలు రెండు.. ఒకటి ఉద్యోగాల కోత, రెండోది టెక్నాలజీ దుర్వినియోగం. ఈ మధ్య మన సోషల్ మీడియాలో ఎఐ సృష్టించిన వీడియోలు విచ్చలవిడిగా వస్తున్నాయి. అసాధ్యంగా, అసహజంగా కనిపించే ఈ వీడియోలను కొందరు అది ఎఐ సృష్టి అని కొట్టిపారేస్తున్నారు. సినిమా నటులు చిన్న టీ కొట్టు వద్ద కూర్చున్నట్లు, లుంగీలపై వారు రోడ్‌పై నడుస్తున్నట్లు కొన్ని వీడియోలు వచ్చాయి. అందులో అసభ్యమేమీ లేనందున ఆ యాక్టర్లు కూడా వాటిని తేలిగ్గా తీసుకున్నట్లున్నారు. వాస్తవానికి ఇది చట్ట వ్యతిరేక కార్యమే. షోలే నటీనటులు యాభై ఏళ్ళ తరువాత తమ పాత్రలతో సెల్ఫీ తీసుకున్నట్లు ఓ వీడియో వచ్చింది. అదేవరుసలో ఓ హోటల్ వ్యక్తి పక్కనున్న మురికి కాలువలోంచి నీటిని వంటచేస్తున్న మూకుట్లో పోస్తున్నట్లు ఒక వీడియో వచ్చింది. దాన్ని అర్థం చేసుకోనివారు ఆ వీడియోకి మతాన్ని జోడించి బూతులెత్తుకున్నారు.

ఇలా చెప్పుకోవడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎఐ ద్వారా రూపొందించిన ప్రతి విషయంలోనూ అది వాస్తవం కాదు, కృత్రిమ మేధ పని అని వాటర్ మార్క్ ఉండాలని ఓ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. తక్షణం అది అమలులోకి రావాలి. ఎఐ వల్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చే సదుపాయాల గురించి ఆ సదస్సులో ఎంతో చర్చ జరిగింది. స్కై ఎయిర్ మొబిలిటీ మానవ జోక్యం లేకుండా వినియోగదారు ఇంటికి ప్యాకేజీలను డెలివరీ చేస్తుంది. దీనికి గ్రౌండ్ రోబోటిక్ వ్యవస్థ సాయంతో ఏరియల్ డ్రోన్లు కదులుతాయి. ఎక్కడా మానవమాత్రుని అవసరం లేదు. నెలకు వంద రూపాయల చార్జీలతో వైద్య సలహాలు, బోధన, ఆర్థిక సలహాలు పొందవచ్చు. టివి ప్రసారాలకు నెలవారీగా చెల్లించినట్లే కేవలం వంద రూపాయలతో డాక్టర్, టీచర్ లాంటివారు అడిగిన వెంటనే తెరపైకి వచ్చి అన్నిచిక్కులు విడదీసి పోతారు. ఈ సేవలను ప్రపపంచమంతా అందించడానికి అమెరికాకు చెందిన యాక్సెల్ అనే సంస్థ సిద్ధంగా ఉంది. ఎఐ సాయంతో ఔషధాల తయారీ సమయాన్ని సగానికి తగ్గించవచ్చని సనోఫి బిజినెస్ ప్రతినిధి అన్నారు.

ఎఐ అవసరాలు తీర్చేందుకు ప్రధానంగా డేటా సెంటర్లు కావాలి. వాటికోసం వేలకోట్లు కుమ్మరించేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. మనదేశం క్లౌడ్ డేటా కంపెనీలకు 20 ఏళ్ల పాటు టాక్స్ మినహాయింపు ఇవ్వడానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వర్ధమాన, వెనుకబడ్డ దేశాల్లో మైక్రోసాఫ్ట్ రాబోయే నాలుగేళ్ళ కాలంలో సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అదే కంపెనీ 2025లో 4% సిబ్బందిని అనగా 15 వేల మందిని తొలగించింది. ముకేశ్ అంబానీ ఎఐ కోసం రూ. 10 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధమని ప్రకటించారు. దీనివల్ల ఉద్యోగాలకు ప్రమాదమేమీ లేదని ఆయన అంటున్నారు. ఎఐ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను కబళిస్తుంది, వారి స్థానాల్లో ఎఐ ఏజెంట్స్ వినియోగం పెరుగుతుందనే వాదన ఇప్పటికే ఉంది. అమెరికాలో వచ్చే 18 నెలల్లో 25 50% వైట్ కాలర్ ఉద్యోగాల కోత ఉంటుందని అక్కడి వ్యాపారవేత్త, మాజీ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రు యాంగ్ అంచనా వేస్తున్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోడీ ఎఐ సైడ్ ఎఫెక్ట్ గురించి మర్మగర్భంగా ప్రస్తావించారు. మానవ్ (ఎంఎఎన్‌ఎవి) పేరిట ఆయన ప్రతిపాదించిన విషయాల్లో నైతికత, చట్టబద్ధత లాంటివి ఉన్నాయి. మరి మనుషులు సత్ప్రవర్తనతో ఉంటేనే కదా దిశ సరిగ్గా ఉండేది.

పౌరుల్లో నైతికత, ప్రభుత్వ విధానంలో నిష్పక్షపాత చట్టబద్ధత ఉన్నపుడే వాటి అమలు కుదురుతుంది. ప్రస్తుతం ఎఐని చూసి భయపడేవారు కొందరైతే, దాన్ని అదృష్టంగా భావించేవారు కూడా ఉన్నారు. దీనిని తాము అదృష్టంగానే భావిస్తున్నాం అని ఆయన అన్నారు. అది ఎవరి అదృష్టానికి పనికొస్తుందో అని భయపడేవారే మన దేశంలో అధికంగా ఉన్నారు. మన దేశంలో పని కట్టుకొని ప్రచారం చేస్తూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు కొల్లలుగా వస్తున్నాయి. ఏవేవో పాత వీడియోలను వర్తమాన కాలానికి జోడించి తప్పుడు ప్రచారం చేసేవారు ఎఐ ప్రమేయంతో కోరిన ఆటలాడుకోవచ్చు.మైనారిటీలపై వస్తున్న యూ ట్యూబర్ల విద్వేష ప్రసారాలపై ప్రభుత్వం మౌనంగా ఉంటోన్న తరుణంలో ఈ ప్రమాదాలకు ఎఐ మరింత ఆజ్యం పోస్తుంది. కేంద్రం అన్ని మతాలకు సరైన భద్రత కలిగించినపుడే సాంకేతిక ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు భారత ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ భద్రత, సామాజిక బాధ్యత.. ఈ రెండిటిని అధిగమించే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే మనదేశం ఎఐపై ముందడుగు వేయడం ప్రజలకు నష్టకారకమే. తుఫాను వస్తే ప్రజలకు పునరావాసం ఎక్కడ కల్పించాలి అనే ముందస్తు ఆలోచన ఉంటుంది. ప్రమాదాలు జరిగితే నివాసితులు కాపాడే వ్యవస్థ అపార్ట్‌మెంట్ నిర్మాణంలోనే ఉంటుంది.

అలాంటిది ఎఐవల్ల ప్రపంచ వ్యాప్తంగా మూడున్నర కోట్ల ఉద్యోగాలకు ముప్పు అని చెబుతూనే అదృష్టంగా భావించడంలో అర్థమేమిటి? ఉద్యోగాలు కోల్పోయేవారికి ప్రభుత్వం నుండి రక్షణ చర్యలేవి? వారి కుటుంబాలు గడిచేందుకు తాత్కాలిక ఆర్థిక సాయం ఏమైనా చేస్తారా? ఎఐ వల్ల సౌలభ్యాలు పెరుగుదల మాటేమో గానీ ఎంతో కష్టపడి చదివి, ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించి కుటుంబాలతో ఉన్నవారికి ఈ దెబ్బతో జరిగే నష్టాన్ని ఎవరు పూరిస్తారు. పరిశ్రమల లాభాల్లో కనీసం 2% కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయాలనే చట్టం మన దేశంలో 2013 నుండి ఉంది. అదే విధంగా తమ కంపెనీలో పని చేసిన ఉద్యోగులను తొలగించిన పక్షంలో వారికి జీవనభృతిగా కొంత సొమ్ము అందేలా విధివిధానాలు రూపొందించాలి. పరిశ్రమల లాభాల కోసమే.. ఏకపక్షంగా ప్రభుత్వాలు ఆలోచించకుండా దేశపౌరుల ప్రయోజనాలకు ముందు పెద్దపీట వేయాలి. అప్పుడే ఎఐ సమ్మిట్ టాగ్ లైన్ అయిన ‘అందరి సంక్షేమం కోసం, అందరి ఆనందం కోసం’ కు సార్థకత లభిస్తుంది.

– బి నర్సన్

94401 28169