Reading Time: 2 minutes

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇష్టారాజ్యంగా విధిస్తున్న టారిఫ్‌లకు అమెరికా సుప్రీం కోర్టు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పునకు లోబడి అమెరికా యంత్రాంగం సుప్రీం కోర్టు తీర్పులో చెల్లవని పేర్కొన్న టారిఫ్‌లను మంగళవారం (24.2.26)నుంచి వసూలు చేయబోమని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్టర్ ప్రొటెక్షన్ ప్రకటించింది. ‘అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఇఇపిఎ) కింద ట్రంప్ విధించిన టారిఫ్‌ల వసూళ్లను నిలిపివేయనున్నట్టు ఇప్పటికే దిగుమతిదారులకు తెలియజేసింది. టారిఫ్‌లు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఫిబ్రవరి 20న తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు షాక్ ఇచ్చినప్పటికీ ట్రంప్ 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122 ని ఉపయోగించి ప్రపంచ వ్యాప్త దిగుమతులపై 15% అదనపు టారిఫ్‌ను విధించారు. ఈ టారిఫ్ 150 రోజుల పాటు అమలులో ఉంటుంది. ఈ 15 శాతం టారిఫ్‌లు తాత్కాలికమైనవి. కాంగ్రెస్ ఆమోదం లేకుండా 150 రోజులకు మించి కొనసాగవు. కొత్త టారిఫ్‌ల వల్ల భారత్‌తో కుదుర్చుకోవలసిన వాణిజ్య ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్త టారిఫ్‌లు ఫిబ్రవరి 24 నుంచి అమలు లోకి వస్తాయని ప్రకటించినప్పటికీ ఈమేరకు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇంకా జారీ కాలేదు. ఈ నేపథ్యంలో కొత్త టారిఫ్‌లు రేపటి నుంచి వర్తిస్తాయా? లేదా అన్నదిఇంకా చెప్పలేం. ట్రంప్ సుంకాల్లో మార్పులు రావడంతో అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు వాయిదా పడ్డాయి.

భారత్‌కు ఇవి సవాళ్ల రోజులు. అమెరికాతో పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. భారత్ కూడా ఈ పరిణామాలను అత్యంత పరిశీలనతో గమనిస్తోంది. వాస్తవానికి భారత్, అమెరికా దేశాలు తమ మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో 18% వరకు టారిఫ్‌లు అమలు చేయడానికి అంగీకరించాయి కూడా. అయితే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం (ఐఇఇపిఎ) కింద ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లుబాటు కాకపోవడంతో కొత్త టారిఫ్‌ల ప్రభావం 15 శాతంతో కలిపి మరో 3.3% వరకు టారిఫ్‌లు ఉండవచ్చు. అందువల్ల ఇదివరకు కుదిరిన మధ్యంతర ఒప్పందం 18 శాతమే అయినందున వీలైనంత త్వరగా ఈ ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకోవలసి ఉంటుంది. దీనివల్ల ఒత్తిళ్లు తగ్గి, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడుతుంది. ట్రంప్ కూడా మధ్యంతర ఒప్పందంలో ఎలాంటి మార్పులు ఉండవన్న సంకేతాలు ఇస్తున్నారు. అమెరికాతో తమ వాణిజ్య ఒప్పందాల నుండి ఏ దేశమూ వైదొలగలేదని అమెరికా వాణిజ్య చీఫ్ జామిసన్ గ్రిర్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ అమెరికాతో తన వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయాలని ఆలోచిస్తుండగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం అన్ని ఎంపికలను పరిశీలిస్తామని చెబుతోంది. దాదాపు ఏడాది కాలంగా ట్రంప్ తన మాట వినని దేశాలను ఏదో విధంగా దారిలోకి తెచ్చేందుకు ప్రతీకార టారిఫ్‌లే సాధనాలుగా వినియోగిస్తున్నారు.

ఈ విషయంలో భారత్‌కు కూడా ఎలాంటి మినహాయింపు లభించలేదు. భారత ప్రధాని మోడీ తనకెంతో మంచి మిత్రుడని ఒక వంక పొగుడుతూ మరోవంక ప్రతిసారీ ఎంతో చులకన చేయడం పరిపాటిగా మారింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఇప్పటికే భారత్‌పై భారీ స్థాయిలో సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగిస్తూ మరోవైపు 500% వరకు సుంకాలు విధించడానికి అమెరికా సిద్ధం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల వెనెజులా అధ్యక్షుడిని అరెస్టు చేసి ఆ దేశంలోని చమురు వనరులను కొల్లగొడుతున్న పరిస్థితి తెలిసిందే. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వాటిలో ముత్యాలు, రంగురాళ్లు, ఔషధాలు, ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల రత్నాల ఎగుమతులు సగానికి సగం పడిపోయాయని లండన్‌కు చెందిన రత్నాల వాణిజ్యసంస్థ డిబీర్స్ గ్రూపు వెల్లడించడం గమనార్హం. చైనా, కెనడా దేశాల మాదిరి ప్రతీకార ధోరణికాకుండా అమెరికాతో ద్వైపాక్షిక చర్చల ద్వారానే సుంకాల సమస్యను పరిష్కరించుకోడానికి భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే అమెరికాయే భారత్‌కు భారీ ఎగుమతుల మార్కెట్.

2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ మొత్తం 119.7 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో భారత్ నుంచి అమెరికాకు అయ్యే ఎగుమతుల విలువే 77.51 బిలియన్ డాలర్ల వరకు ఉండడం గమనార్హం. అత్యధిక ప్రతీకార టారిఫ్‌లతో ప్రపంచ దేశాల్లో అలజడి సృష్టిస్తున్న ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలపై అమెరికా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పాలనా వ్యవహారాల్లో కూడా అసంతృప్తి కనిపిస్తోంది. 60% అమెరికన్లు ట్రంప్ పాలనపట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎబిసి న్యూస్, వాషింగ్టన్ పోస్ట్, ఐపివోస్ సర్వేల్లో ప్రతి ముగ్గురు అమెరికన్లు ట్రంప్ పాలనపై వ్యతిరేకంగా ఉన్నట్టు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం విషయం లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆయనకు వ్యతిరేకంగా ఉండగా, ఇతర దేశాలతో సంబంధాల విషయంలో 62% ప్రజలు ఆయన పాలనను నిరాకరిస్తున్నారు. ఇంటిపన్నుల విషయంలో పది మందిలో ఆరుగురు ఆయన విధానాలను నిరాకరిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. ట్రంప్ అధికారం లోకి వచ్చిన దగ్గర నుండీ అమెరికా పరిస్థితులు మరింత దిగజారాయనీ, దాదాపు 50% మంది ప్రజలు భావిస్తున్నట్టు సర్వేలో బయటపడింది. ఏదేమైనా ట్రంప్ విధానాలకు ఎదురు దెబ్బ తగులుతోంది.