Reading Time: 2 minutes

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామలోని మల్లన్న జాతరలో చోటుచేసుకున్న అమానవీయ కులవివక్ష ఘటన మన దేశ రాజ్యాంగ ఆత్మపై జరిగిన బహిరంగ దాడిగా చరిత్రలో నిలవాల్సిన సంఘటన. భక్తిపేరుతో కూడిన వేడుకలో భక్తుడి కులం అడగడం అంటే దేవునికే కులపత్రం జారీ చేయడమే. ఇది కేవలం ఒక అవమానం కాదు. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన అపరాధం. భారత రాజ్యాంగ పీఠిక స్పష్టంగా ప్రకటిస్తుంది: సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచన, వ్యక్తీకరణ, విశ్వాస, ధర్మాచరణ స్వేచ్ఛ; స్థితి, అవకాశ సమానత్వం; వ్యక్తి గౌరవం, జాతీయ ఐక్యతను బలపరిచే సౌభ్రాతృత్వం ఇవే భారత గణతంత్రానికి మూల విలువలు. ఈ విలువలను ఉల్లంఘించే ప్రతి చర్యా రాజ్యాంగాన్ని అవమానించడం. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు సమానత్వం, చట్టాల సమాన రక్షణ ప్రతి పౌరునికి హామీ. దేవాలయ ద్వారం వద్ద కులం అడగడం, ప్రవేశం నిరాకరించడం ఈ సమానత్వ సూత్రాన్ని ఛిద్రం చేస్తుంది. ఆర్టికల్ 15(1) స్పష్టం చేస్తున్న ప్రకారం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా రాష్ట్రం ఎటువంటి వివక్ష చేయరాదు. జాతర వంటి ప్రజా ప్రదేశంలో కులవివక్ష ఈ నిబంధనకు విరుద్ధం. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేస్తుంది: అంటరానితనం రద్దు చేయబడింది; దాని ఏ రూపంలోనైనా ఆచరణ శిక్షార్హమైన నేరం. దేవాలయ ప్రవేశాన్ని కులం ఆధారంగా నిరాకరించడం అంటరానితనమే. ఆర్టికల్ 21 ప్రకారం జీవించుటకు, వ్యక్తిగత స్వేచ్ఛకు హక్కు ప్రతి పౌరునికీ ఉంది.

గౌరవంతో జీవించడం ఈ హక్కులో భాగం. కులవివక్ష గౌరవ హననం. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికీ తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించు హక్కు ఉంది. దేవాలయంలో ప్రవేశం నిరాకరించడం ఈ మౌలిక హక్కును తుంచడం. ఇన్ని రాజ్యాంగ హామీలున్నప్పటికీ, వాస్తవంలో వెయ్యికిపైగా కులవృత్తుల చేతులను సమాజం వినియోగిస్తుంది. పంట కోయించుకోవడానికి, ఇళ్లు కట్టించుకోవడానికి, శ్రమను దోచుకోవడానికి వారిని అంగీకరిస్తుంది. కానీ అదే చేతులు దేవాలయ గర్భగుడి తలుపు తట్టితే అర్హత లేదు అంటుంది. వృత్తులకు పనికొస్తారు భక్తికి పనికిరారా? శ్రమకు గౌరవం ఉంది ఆరాధనకు గౌరవం లేదా? ఇది నైతిక విరోధాభాసం. కులవ్యవస్థ చరిత్రలో ఒక నిర్మాణంగా మొదలై, దోపిడీ యంత్రాంగంగా మారింది. నీటి హక్కు నిరాకరణ, వీధి వేరుచేయడం, దేవాలయ ప్రవేశ నిషేధం ఇవన్నీ అణగారినవర్గాల గుండెల్లో శాశ్వత గాయాలయ్యాయి. బడుగు, బలహీన, అంటరాని వర్గాల కన్నీళ్లు మన సమాజ నైతిక వైఫల్యానికి సాక్ష్యం. జంతువులు తమ గుంపులో ఒకదానిని ఒకటి కులం పేరుతో తక్కువ చేయవు. మనిషి మాత్రం మేధస్సుతోపాటు క్రూరత్వాన్ని పెంచుకున్నాడు. మానవత్వం మంటల్లో కాలిపోతే నాగరికతకు అర్థం ఏమిటి? ఈ ఘటనపై తక్షణ చర్యలు అవసరం.

అంటరానితనానికి సంబంధించిన నేరాలపై కఠినంగా అమలవుతున్న చట్టాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అట్రాసిటీస్ నిరోధక చట్టం సమర్థంగా అమలవ్వాలి. వేగవంతమైన విచారణలు జరగాలి. బాధితులకు రక్షణ, పునరావాసం, న్యాయం అందాలి. దేవాలయ పరిపాలనలో అన్ని వర్గాల ప్రతినిధిత్వం ఉండాలి. విద్యా వ్యవస్థలో రాజ్యాంగ విలువలు కేవలం పాఠ్యాంశం కాకుండా జీవనశైలి కావాలి. సమానత్వం రాజ్యాంగ సూత్రం మాత్రమే కాదు – అది ప్రజాస్వామ్య ప్రాణవాయువు. సమానత్వం లేకపోతే స్వేచ్ఛ అర్ధహీనమవుతుంది. సౌభ్రాతృత్వం లేకపోతే జాతీయ ఐక్యత కూలిపోతుంది. గౌరవం లేకపోతే జీవితం వెలితిగా మారుతుంది. మల్లన్న జాతరలో జరిగిన ఈ ఘటన మన ముందుకు ఒక స్పష్టమైన ప్రశ్నను తెస్తోంది: మనం రాజ్యాంగాన్ని కాపాడుతున్నామా? లేక కుల గోడలను కాపాడుతున్నామా? దేవుడు అందరివాడే అయితే దేవాలయం కూడా అందరిదే కావాలి. రాజ్యాంగం మన అందరి గ్రంథం అయితే, సమానత్వం మన అందరి ఆచరణ కావాలి.

ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికీ తన మతాన్ని స్వతంత్రంగా ఆచరించు హక్కు ఉంది. దేవాలయ ప్రవేశం నిరాకరించడం ఈ హక్కును పరిమితం చేస్తుంది; ఇది ఒక వ్యక్తి మత సాధనలో రకమైన అడ్డంకిగా నిలుస్తుంది. ఈ హక్కు ఉన్నప్పటికీ, ఆచరణలో ఈ హక్కును తక్కవగా అమలు చేయడం ప్రస్తుత సమాజంలోని శాశ్వత క్రూరత్వాన్ని సూచిస్తుంది. సమాజంలో దేవాలయ పరిపాలనలో తుల్యమైన ప్రతినిధిత్వం ఉండాలి. విద్య వ్యవస్థలో రాజ్యాంగ విలువలు జాగ్రత్తగా పాఠ్యాంశంగా మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి జీవనంగా నేర్చుకోవాలి. సమానత్వం, గౌరవం వంటి రాజ్యాంగ విలువలు కేవలం పాఠ్యపుస్తకాల్లోనే కాకుండా ప్రతి సమాఖ్య, వేడుక, పబ్లిక్ ప్రదేశంలో జీవించాల్సిన జీవనశైలి కావాలి. కులవ్యవస్థ పోరాటంగా మొదలైనప్పటికీ, అది సమాజంలో నిర్మాణాత్మక విధంగా మారింది; అలాంటి నిర్మాణం నీటి -భూమి- వేదికల హక్కులకు, వీధి వేరుచేయడం, దేవాలయ ప్రవేశ నిషేధం వంటి రూపాలలో అణగారిన వర్గాల గుండెల్లో శాశ్వత గాయాలను పడేసింది. శ్రమకు గౌరవం ఉన్నా, ఆరాధనకు గౌరవం లేదనే భావం సమాజాన్ని పగులగొడుతోంది. ఇప్పటికైనా మనం నిర్ణయించుకోవాలి – కులం అనే చీకటిని కొనసాగించాలా? లేక రాజ్యాంగ విలువల వెలుగులో కొత్త భారతాన్ని నిర్మించాలా? మానవత్వం మంటల్లో కాలిపోకుండా కాపాడేది ఒక్కటే – సమానత్వం. కానీ దాన్ని సాధించడానికి ఈ భారత భూమి ఇంకా ఎన్ని కుల రాక్షసి వికార కోరల్లో మరణించిన మృతదేహాలను తనలో దాచుకోవాలో.

– ఆత్మకూరి ప్రశాంత్ చారి

79894 21153