
Mega Podcast: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓటీటీ రంగంలో సరికొత్త సునామీ సృష్టించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. సుమారు పదేళ్ల క్రితం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన బాస్.. ఇన్నాళ్లకు నేరుగా అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా గ్రాండ్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది మాత్రం ఆయన అందుకోబోతున్న కళ్లు చెదిరే పారితోషికమే. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యునరేషన్లు ఆకాశాన్ని తాకుతుంటాయి. కానీ చిరంజీవి ఒక్క సినిమాకు తీసుకునే రికార్డు స్థాయి పారితోషికాన్ని సైతం తలదన్నేలా నెట్‌ఫ్లిక్స్ ఈ షో కోసం బంపర్ ఆఫర్ ఇచ్చిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
మెగా డాటర్ సుస్మిత కొణిదెల, ప్రముఖ రైటర్-డైరెక్టర్ బీవీఎస్ రవి సంయుక్తంగా సిద్ధం చేసిన మల్టీ-ఎపిసోడ్ పాడ్‌కాస్ట్ కాన్సెప్ట్‌కు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ఒక్క సిట్టింగ్‌లోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఊహకందని బడ్జెట్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం. సాధారణంగా టీవీల్లో వచ్చే రొటీన్ టాక్ షోల తరహాలో కాకుండా, సరికొత్త గ్లోబల్ పాడ్‌కాస్ట్ ఫార్మాట్‌లో ఇది సాగనుందట. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో బయట ప్రపంచానికి తెలియని మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన ఎదుర్కొన్న తెరవెనుక అనుభవాలు, ఎత్తుపల్లాలు, కష్టనష్టాలను ఇందులో స్వయంగా ఆయనే రివీల్ చేయనున్నారట. అంతేకాకుండా, గ్లోబల్ రేంజ్ సెలబ్రిటీలతో చిరంజీవి జరిపే ముఖాముఖి సంభాషణలు ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ అనుభూతిని అందించనున్నట్లు తెలుస్తుంది. ఓటీటీ చరిత్రలోనే కనివినీ ఎరుగని రెమ్యునరేషన్‌తో మెగాస్టార్ వేస్తున్న ఈ అడుగు.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త ట్రెండ్‌కు తెరలేపడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.