Reading Time: 2 minutes
Supreme Court: యూపీపై MDR ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

యూపీఐ వాణిజ్య లావాదేవీలపై కొత్తగా విధించనున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. యుపిఐ ఎండీఆర్ ఛార్జీల విధానం, ప్రాతిపదికపై వివరణాత్మక అఫిడవిట్ సమర్పించాలని కేంద్రానికి ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని సూచించింది. జస్టిస్ బాగ్చీ 140 కోట్ల మందిపై ప్రభావం చూపే ఈ నిర్ణయం వెనుక ఉన్న కార్యనిర్వాహక పరిధి ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత అక్టోబర్ చివరి వారం లో కేసు విచారణ కొనసాగనుంది.

కేంద్రం వాదన ఏంటి?

ఈ కేసు విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకట్రామన్ కేంద్రం తరఫున వాదనలు వినిపించారు.. యూపీఐ వినియోగదారుల్లో 96 శాతం మందికి ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉందని తెలిపారు. నిత్యావసర సేవల లావాదేవీలపై గరిష్టంగా రూ.5కే పరిమితం చేశామని వివరించారు. ఇది ప్రభుత్వం వసూలు చేసే రుసుము లేదా పన్ను కాదని, బ్యాంకులు-గేట్‌వేల మధ్య జరిగే సెటిల్‌మెంట్ ఫీజు అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని, ఎన్‌పీసీఐ దీన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 15 నుంచి ఈ నూతన నిబంధన మొదటి మైలురాయిగా అమలులోకి రానుందని న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు.

పిటిషనర్ వాదనలు ఏంటీ?

యూపీఐ (UPI) చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ (MDR) చార్జీల విధింపునకు వ్యతిరేకంగా ప్రముఖ న్యాయవాది అంజన్ దత్తా పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 14న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను, సెప్టెంబర్ 15న ప్రకటించిన MDR ఫ్రేమ్‌వర్క్‌ను వెంటనే రద్దు చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ప్రత్యామ్నాయంగా, పారదర్శక సంప్రదింపులు జరిపి, ఎంఎస్‌ఎంఈలకు తగిన రక్షణ కల్పించేలా ఈ విధానాన్ని పునఃపరిశీలించాలని కోరారు. భవిష్యత్తులో చేపట్టే ఏ ఎండీఆర్ వర్గీకరణ అయినా వ్యాపారి టర్నోవర్, చట్టబద్ధమైన ఎంఎస్ఎంఈ హోదా, వాస్తవ మార్జిన్లు, భౌగోళిక ప్రాంతం మరియు ఖర్చును భరించే సామర్థ్యం ఆధారంగా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 లోని సవరించిన సెక్షన్ 10A రాజ్యాంగబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఎలాంటి తగిన చట్టబద్ధమైన రక్షణలు, ప్రజా సంప్రదింపులు లేకుండా ఈ సుంకాన్ని హడావుడిగా ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఈ నిర్ణయం వివక్షాపూరితంగా ఉందని, తక్కువ మార్జిన్‌లు ఉన్న వ్యాపారులకు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఇది తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని తెలిపారు.

ఈ అదనపు భారం పరోక్షంగా వినియోగదారులపై పడి, ప్రజలు డిజిటల్ లావాదేవీలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. అలాగే, యూపీఐ లావాదేవీలకు, రూపే డెబిట్ కార్డ్ చెల్లింపులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ప్రస్తావించారు ..UPI ఛార్జీలు వినియోగదారులపై ప్రభావం చూపి బ్లాక్ మనీ పెరగవచ్చని వాదించినా, ధర్మాసనం ప్రస్తుత దశలో స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

యూపీఐ ఎండీఆర్ కొత్త ఛార్జీల వివరాలు

యూపీఐ ఎండీఆర్ ఛార్జీల కొత్త విధానం ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు పైగా ఉన్న సాధారణ మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.75,000కు పైగా ఉన్న లావాదేవీలకు గరిష్ట ఛార్జీ రూ.300గా ఉంటుంది. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి నిత్యావసర రంగాల్లో ఫ్లాట్ రూ.5 మాత్రమే వసూలు చేస్తారు.

పిటల్ మార్కెట్ లావాదేవీలపై 0.02 శాతం ఛార్జీ ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) లావాదేవీలు, రూ.2,000 వరకు మర్చంట్ చెల్లింపులు పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయి. నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ క్యూఆర్ ద్వారా రాబడి పొందే చిన్న మర్చంట్లకు కూడా మినహాయింపు ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.