
OTR : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది. తుది ఓటర్ల జాబితా ప్రకటించాక ఎప్పుడైనా… ఎన్నికల షెడ్యూల్ రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో… ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారన్న విశ్లేషణలు జోరుగా జరిగిపోతున్నాయి. అందులో భాగంగా రకరకాల ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇక బీజేపీ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారన్న చర్చ కూడా ఎక్కువగానే జరుగుతోంది. కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ఆ పార్టీ నుండి గతంలో పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డినే మరోసారి బరిలో దింపవచ్చని అంటున్నాయి కాషాయ వర్గాలు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను బీజేఎల్పీ తరపున ఫైల్ చేయించడం, ఆ కేసును రెగ్యులర్‌గా ఫాలో అప్ చేయడం, పార్టీ లీగల్ సెల్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండటం లాంటి పనులన్నిటిలో రామ చంద్ర రెడ్డి యాక్టివ్ రోల్ పోషించారట. అలాగే… సుప్రీం కోర్టులో కేసు విచారణ సందర్భంగా చింతల ఢిల్లీ కూడా వెళ్ళారు. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటున్న పార్టీ నేతలు టికెట్ ఆయనకేనని చెప్పుకుంటున్నారు.
తాజాగా జరిగిన ఓ మీటింగ్‌తో ఆ క్లారిటీ వచ్చిందని అంటున్నాపు. సస్పెన్స్‌కు దాదాపు తెరపడినట్టేనన్నది పార్టీ వాయిస్. రెండు రోజుల క్రితం చింతల రామచంద్ర రెడ్డి లంచ్ పార్టీ ఇచ్చారు. ఖైరతాబాద్‌కు చెందిన పార్టీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఆ సందర్భంగా చింతలకు సన్మానం చేశారు. పార్టీ టిక్కెట్ రేస్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న వారు కూడా ఈ మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. ఈ లంచ్ ప్రోగ్రాంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సరిగ్గా ఈ పాయింట్‌నే హైలైట్ చేస్తున్నాయి బీజేపీ వర్గాలు. లంచ్ మీటింగ్‌కు కిషన్ రెడ్డి హాజరవడం అంటేనే పెద్ద సంకేతమని చెప్పుకుంటున్నారు. ఒకవేళ టిక్కెట్ అడగాలని ఎవరి మనసులోనైనా ఉన్నాసరే…ఈ పరిణామం తర్వాత వెనక్కి తగ్గుతారన్న టాక్ పార్టీలో వినిపిస్తోంది. కిషన్‌రెడ్డి కూడా పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చినట్టే నని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉప ఎన్నిక వస్తే గతంలో పోటీ చేసిన వారికే అవకాశం ఇవ్వడం సహజం. ఆ లెక్కన చూసుకున్నా… గతంలో ఇక్కడి నుండి చింతలనే పోటీ చేశారు… ఒక సారి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు కూడా. దీంతో… బైపోల్‌లో ఆయన అభ్యర్థిత్వం ఖరారైపోయినట్టేనన్నది కమలం వాయిస్. ఖైరతాబాద్ ఉప ఎన్నిక అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా సవాలే. ఈ నియోజకవర్గం ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. దీంతో… గెలుపు బాధ్యతను తన భుజాల మీద వేసుకుని తిరగాల్సిందే. సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు పరిధిలో ఇది రెండో ఉప ఎన్నిక.