Reading Time: 2 minutes
Rohit Sharma Said Iam A Big Fan Of Virat Kohlis Test Captaincy Ind Vs Wi

Rohit Sharma Praises Virat Kohli’s Test Captaincy: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీపై స్టార్ బ్యాటర్, మాజీ సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. టెస్టు జట్టు కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాలను తాను ఎంతో అభినందిస్తానని తెలిపాడు. విరాట్ నాయకత్వంలో భారత టెస్టు జట్టు సాధించిన విజయాలు మరుపురానివి అని పేర్కొన్నాడు. సుదీర్ఘకాలంగా భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇద్దరం కలిసి ప్రయాణించామని, తమ మధ్య పరస్పర గౌరవం ఇప్పటికీ కొనసాగుతోందని హిట్‌మ్యాన్ వెల్లడించాడు. ప్రస్తుతం తాము అంతగా కలిసి సమయం గడపకపోయినా.. బ్యాటింగ్‌కు సంబంధించిన విషయాల్లో ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూనే ఉంటామని రోహిత్ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ 2014 నుంచి 2022 వరకు 68 టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కింగ్ నాయకత్వంలో భారత్ 40 విజయాలు సాధించగా.. 17 మ్యాచ్‌ల్లో ఓటమి, 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత టెస్టు కెప్టెన్లలో అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించడంతో పాటు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఎంఎస్ ధోనీ 60 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి.. 27 విజయాలు అందించాడు. ఇక రోహిత్ శర్మ 2022 నుంచి 2024 వరకు 24 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియా 12 విజయాలు సాధించగా.. 9 ఓటములు, 3 డ్రాలు నమోదయ్యాయి. కోహ్లీతో పోలిస్తే రోహిత్ కెప్టెన్సీ కాలం తక్కువే అయినప్పటికీ.. టెస్టు కెప్టెన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

తాజాగా రోహిత్ శర్మ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో తీసుకొచ్చిన మార్పులను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘భారత్ టెస్టు జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంతో చేశాడు. కోహ్లీని అభినందించి తీరాల్సిందే. కోహ్లీ నాయకత్వంలో భారత టెస్టు జట్టు సాధించిన విజయాలు, పోరాట స్ఫూర్తి అద్భుతం. మా మధ్య కేవలం కెప్టెన్సీ లేదా జట్టు విషయాలపైనే చర్చలు జరగవు. ఇద్దరం మా వ్యక్తిగత బ్యాటింగ్‌ను ఎలా మెరుగుపరుచుకోవాలనే అంశంపై కూడా తరచూ మాట్లాడుకుంటాము. నా బ్యాటింగ్‌లో ఏదైనా మార్పు అవసరమని కోహ్లీ భావిస్తే చెబుతాడు. అలాగే కోహ్లీ ఆటలో నేను గమనించిన విషయాలను అతడితో పంచుకుంటా. ఈ విషయంలో మా మధ్య సంభాషణ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది’ అని హిట్‌మ్యాన్ వెల్లడించాడు.

అయితే ప్రస్తుతం తాము ఇద్దరం తరచుగా కలుసుకోలేకపోతున్నామని, కాస్త బాధగా ఉందని రోహిత్ శర్మ సరదాగా చెప్పాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తుండటంతో ఇద్దరి ఇళ్లు చాలా దూరంగా ఉన్నాయని చమత్కరించాడు. గతంలో ప్రతి 5-7 రోజులకు ఒకసారి కలుసుకునేవాళ్లమని, అప్పుడు ఇంట్లో గడిపే సమయం చాలా తక్కువగా ఉండేదని గుర్తుచేశాడు. ఇప్పుడు ఇద్దరం ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ.. భౌగోళిక దూరం కారణంగా తరచుగా కలుసుకోవడం తగ్గిపోయిందని హిట్‌మ్యాన్ చెప్పాడు. కోహ్లీ, రోహిత్ భారత క్రికెట్‌లో సుదీర్ఘకాలంగా కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. వారి మధ్య ఉన్న పోటీ కంటే పరస్పర గౌరవం, ఒకరి ఆటను మరొకరు మెచ్చుకోవడం ఎక్కువగా కనిపిస్తుందని రోహిత్ తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.