Reading Time: 2 minutes
Gyanesh Kumar Removal Notice Opposition Sir Election Commission Row

Gyanesh Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ విపక్షాలు మళ్లీ దూకుడు పెంచుతున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంట్‌లో మరోసారి తొలగింపు నోటీసు ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై, ఎలక్షన్ కమిషన్ తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన లేదా తొలగింపు నోటీసు ఇవ్వడం విపక్షాలకు ఇది మూడోసారి కావడం గమనార్హం. నిజానికి గతేడాది మార్చి 12న తొలిసారిగా విపక్షాలు రెండు సభల్లోనూ నోటీసులు ఇచ్చాయి. రాజ్యసభలో 63 మంది, లోక్‌సభలో 130 మంది ఎంపీలు సంతకాలు చేసిన ఈ నోటీసులను రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు తిరస్కరించారు. ఆ తర్వాత ఏప్రిల్ 24న వివిధ పార్టీలకు చెందిన 73 మంది ఎంపీల సంతకాలతో రాజ్యసభలో మరో నోటీసు ఇచ్చారు. అందులో కుమార్‌పై తొమ్మిది తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, ఆయన నిరూపితమైన అపచారం (ప్రూవ్‌డ్ మిస్‌బిహేవియర్) చేశారని పేర్కొన్నారు. ఈ నోటీసు ఇప్పటికీ రాజ్యసభ చైర్మన్ పరిశీలనలోనే పెండింగ్‌లో ఉంది.

ఇదిలా ఉండగా, ఇప్పుడు మూడోసారి రెండు సభల్లోనూ కొత్తగా నోటీసులు ఇవ్వాలని విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈసారి ఎలక్షన్ కమిషన్ లోపల కమిషనర్ల మధ్య వచ్చిన విభేదాలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వ్యక్తమైన అభ్యంతరాల ఆధారంగా తయారుచేసిన కొత్త నివేదికను ప్రధాన అస్త్రంగా మార్చుకోనున్నాయి. మరోవైపు జ్ఞానేష్ కుమార్‌తో పాటు ఎలక్షన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీ, శ్రీనగర్, పట్నా, రాంచీ, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ హెడ్‌క్వార్టర్స్‌కు మార్చ్‌గా వెళ్తున్న ఆందోళనకారులపై భద్రతా సిబ్బంది వాటర్ క్యానన్లను ఉపయోగించారు. సెప్టెంబర్ 25న కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్నా, ఛండీగఢ్ సహా పలు రాష్ట్రాల రాజధానుల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ అంశంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోంది. నేడు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు ఎస్‌ఐఆర్ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదుకు వాడే ఫామ్-6 మార్పులు, ఓటర్ల పేర్ల తొలగింపులు-చేరికలు, డిజిటల్ డేటాబేస్ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తం చేశారని ఖర్గే తెలిపారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా, సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో సుమారు 21 విపక్ష పార్టీలు భేటీ అయి సంయుక్త వ్యూహాన్ని, కొత్త తొలగింపు నోటీసు రూపురేఖలను చర్చించనున్నాయి.

మరోవైపు విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఖండించింది. కమిషన్ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నంత మాత్రాన సంస్థ పనితీరు దెబ్బతిన్నట్లు కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థల్లో భిన్నాభిప్రాయాలు సాధారణమేనని, ఎస్‌ఐఆర్‌కి సంబంధించిన నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయని పేర్కొంది. ఫామ్-6లో చేసిన మార్పులను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని, చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపింది. అలాగే ఓటర్లకు ఇబ్బంది కలగకుండా క్లెయిమ్స్ సమర్పించడానికి అదనపు సమయం ఇవ్వడం, అధికారులు స్వయంగా ఇళ్లకు వెళ్లడం, ఓటర్ల తొలగింపు నోటీసులు వచ్చిన వారి కోసం హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టామని వివరించింది. అయితే, గత 10 నెలల కాలంలో ఓటర్ల జాబితాలు, రిజిస్ట్రేషన్ల విధానం, డిజిటల్ వ్యవస్థలపై ఇతర కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు కనీసం 14 అధికారిక అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనమే ఈ రాజకీయ దుమారానికి కారణమైంది. విపక్షాలు ఈ కథనాన్ని అడ్డుపెట్టుకుని ఈసీపై విరుచుకుపడుతుండగా, అధికార బీజేపీ మాత్రం ఈసీ చర్యలను సమర్థిస్తూ సంస్థల్లో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని పేర్కొంది.