Reading Time: 2 minutes
Ntv Effect Antera Restaurant Gachibowli Tg Safe Action

గచ్చిబౌలిలోని ప్రముఖ ‘అంతేరా’ (Antera) రెస్టారెంట్ నిబంధనల ఉల్లంఘనపై ఎన్టీవీ (NTV) ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందన లభించింది. అధికారులు ఫుడ్ లైసెన్స్ రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చినా బేఖాతర్ చేస్తూ రెస్టారెంట్ నడుపుతున్న తీరుపై ఎన్టీవీ నిలదీయడంతో టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు తక్షణమే స్పందించారు. అధికారుల పునఃచర్యలు, హెచ్చరికల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నానికి అంతేరా రెస్టారెంట్ నిర్వాహకులు దిగివచ్చి, హోటల్‌ను పూర్తిగా మూసివేశారు.

శనివారం నోటీసులు.. ఆదివారం యథేచ్ఛగా వ్యాపారం

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహించిన గచ్చిబౌలి అంతేరా రెస్టారెంట్‌పై శనివారం టీజీ సేఫ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేశారు. వంటగదిలో ఫంగస్ సోకిన కూరగాయలు, గడువు ముగిసిన పదార్థాలు, బొద్దింకల ఉనికిని గుర్తించి కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. అయితే, అధికారుల ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయని అంతేరా యాజమాన్యం ఆదివారం నాటికి మళ్లీ రెస్టారెంట్‌ను తెరిచి యథేచ్ఛగా వ్యాపారం కొనసాగించింది. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని బుకాయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడింది.

ఎన్టీవీ దెబ్బకు కదిలిన టీజీ సేఫ్ అధికారులు

అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ అంతేరా రెస్టారెంట్ ఆదివారం యథేచ్ఛగా నడుస్తున్న తీరును, యాజమాన్యం నియమాలను ఉల్లంఘిస్తున్న వైఖరిని ఎన్టీవీ ప్రత్యేక పరిశోధనాత్మక కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. శనివారం నోటీసులు ఇస్తే ఆదివారం రెస్టారెంట్ ఎలా తెరుస్తారంటూ ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాలు తీవ్ర కలకలం రేపాయి. ఎన్టీవీ కథనాలకు తక్షణమే స్పందించిన టీజీ సేఫ్ అధికారులు సోమవారం ఉదయం పునఃపరిశీలనకు శ్రీకారం చుట్టి, నిర్వాహకులకు మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీవీ కథనాలు , టీజీ సేఫ్ అధికారుల హెచ్చరికల దెబ్బకు అంతేరా రెస్టారెంట్ యాజమాన్యం సోమవారం మధ్యాహ్నానికి దిగిరాక తప్పలేదు. ఆదివారం నిరంతరాయంగా వ్యాపారం సాగించిన సదరు యాజమాన్యం, సోమవారం మధ్యాహ్న సమయానికి రెస్టారెంట్ తలుపులు మూసివేసి కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్ తీరును ఎండగట్టి, మూసివేసేలా చేసిన ఎన్టీవీ కథనాలపై వినియోగదారులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఫుడ్ లైసెన్సులు రద్దు చేసినా ఆదేశాలను బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా వ్యాపారాలు నడుపుతున్న నిర్వాహకుల తీరుపై ‘ఎన్టీవీ’ ప్రసారం చేసిన వరుస పరిశోధనాత్మక కథనాలకు అధికారులు తక్షణమే స్పందించారు. నగరంలో నిబంధనలు ఉల్లంఘించిన 11 ప్రముఖ సంస్థల ఫుడ్ లైసెన్సులను సస్పెండ్ చేస్తూ, వాటి కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాలని సోమవారం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో గచ్చిబౌలిలోని అంతేరా, అల్ సబా, శివాని రెస్టారెంట్లతో పాటు హైటెక్ సిటీలోని మొనాస్టరీ, కోల్ స్పార్క్, కాంచీ కేఫ్, మాధాపూర్ లక్కీ మల్టీకుసిన్, సాయిరామ్ మెస్, ఉడుపీస్ ఉపహార్, అమ్ ఆహా తెలుగు కిచెన్, ఫ్యూజన్ 9/ఆమ్నీషియా స్కై బార్‌లు ఉన్నాయి. అలాగే రమేశ్వరం కేఫ్, ఇష్టా, షాఘౌస్, షాదాబ్, సాహిబ్స్ బార్బెక్యూ, పక్కా లోకల్ సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేసి రీ-ఇన్‌స్పెక్షన్ చేపడతామని ప్రకటించగా.. హోటల్ అవసా, మినర్వా గ్రాండ్, 63 డిగ్రీస్ మోడర్న్ రీజినల్ బఫేలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

కాగా, టీజీ సేఫ్ తనిఖీల పర్వంలో భాగంగా గచ్చిబౌలి ఇందిరా నగర్‌లోని ప్రముఖ ‘ఉడుపీస్ ఉపహార్’ రెస్టారెంట్ తలుపులు పూర్తిగా మూతపడ్డాయి. ‘ప్యూర్ వెజ్’ ట్యాగ్‌లైన్‌తో శుచి, శుభ్రత పేరిట రెట్టింపు ధరలకు ఆహారాన్ని విక్రయిస్తున్న ఈ హోటల్‌లో అధికారులు జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కనీసం గాలి, వెలుతురు కూడా ప్రసరించని వంటగదిలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీతో పాటు ఆహార పదార్థాల మధ్య ఎలుకలు, బొద్దింకలు స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించి ఫుడ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. ప్యూర్ వెజ్ అనే నమ్మకంతో ఎక్కువ డబ్బులు వెచ్చించి ఇక్కడ ఆహారం తింటున్నామని, కిచెన్‌లోని దారుణ పరిస్థితుల గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురవుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్న ఇలాంటి రెస్టారెంట్లపై ప్రతిరోజూ క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలని నగరవాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.