
H-1B Visa: అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ఎంతోమంది విదేశీయుల, ముఖ్యంగా మన భారతీయ టెకీల దశాబ్దాల కల. 1990లో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ కాలంలో ప్రారంభమైన ‘H-1B వీసా’ వ్యవస్థ.. అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఒక పెద్ద ద్వారంగా మారింది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ వీసాల జారీపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటమే లక్ష్యంగా H-1B నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.
ఇటీవల ‘ఆల్-ఇన్’ (All-In) పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్.. తమ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలను గట్టిగా సమర్థించారు. H-1B వీసా అనేది అమెరికన్ ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తక్కువ జీతాలకు వచ్చే విదేశీయులను తెచ్చుకోవడానికి కాదని, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే అత్యున్నత నైపుణ్యాలున్న వారి కోసం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు వేలాది మంది అమెరికన్ ఉద్యోగులను లేఆఫ్స్ పేరుతో తీసేస్తూ, మరోవైపు నైపుణ్యం కలిగిన వర్కర్లు దొరకడం లేదంటూ H-1B వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఉదాహరణకు, ఒక కంపెనీ 5,000 మంది స్థానిక ఉద్యోగులను తీసేసి, తక్కువ జీతానికి పనిచేసే విదేశీ అకౌంటెంట్‌ను నియమించుకోవాలనుకోవడం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశానికే విరుద్ధమని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 18న ట్రంప్ ఒక కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీని ప్రకారం.. ఇకపై ఏదైనా కంపెనీ H-1B వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ సంస్థ ఇటీవల అమెరికన్ ఉద్యోగులను ఎవరినైనా తీసివేసిందా లేదా భవిష్యత్తులో తీసివేసే ప్లాన్ ఉందా అనే కోణంలో స్టేట్, లేబర్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్లు ఆరా తీస్తాయి. పాత లేబర్ అప్లికేషన్లను పరిశీలించి, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా లేబర్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు వెళ్లాయి. దీనికి తోడు, అమెరికా వెలుపల నుంచి వచ్చే నిర్దిష్ట H-1B పిటిషన్లపై 1,00,000 డాలర్ల (సుమారు రూ. 85 లక్షలకు పైగా) భారీ ఫీజును నిబంధనగా విధించారు. ఈ నియమాన్ని సెప్టెంబర్ 21, 2027 వరకు పొడిగించారు. కేవలం జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన మినహాయింపులకు మాత్రమే దీని నుంచి వెసులుబాటు ఉంటుంది. ఈ కఠిన నిర్ణయాల వల్ల మార్పు స్పష్టంగా కనిపిస్తోందని వైట్ హౌస్ చెబుతోంది. గతంలో అడ్డంకులు విధించిన తర్వాత ప్రధాన ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీల H-1B రిజిస్ట్రేషన్లు ఏకంగా 92 శాతం తగ్గిపోయాయని తెలిపింది. తక్కువ జీతాల కేటగిరీ దరఖాస్తులు తగ్గి, అత్యధిక వేతన స్థాయిలు ఉన్న వీసా రిజిస్ట్రేషన్లు పెరిగాయని వెల్లడించింది. అయితే, ఈ $100,000 ఫీజుపై అమెరికా కోర్టుల్లో న్యాయపోరాటాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలను సవరించేంత రాజకీయ బలం కాంగ్రెస్‌లో లేకపోవడంతోనే తమ ప్రభుత్వం పరిపాలనా పరమైన మార్పుల ద్వారా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తోందని వాన్స్ వివరించారు.
ఈ నిర్ణయాల ప్రభావం మన భారతీయులపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే H-1B వీసాలను అత్యధికంగా పొందుతున్నది మనవాళ్లే. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన మొత్తం H-1B పిటిషన్లలో 71 శాతం (దాదాపు 2,83,400 వీసాలు) భారతీయ పౌరులకే లభించాయి. రెండవ స్థానంలో ఉన్న చైనా వాటా కేవలం 12 శాతమే. కాబట్టి అమెరికా తెచ్చిన కొత్త నిబంధనలు భారతీయ ఐటీ రంగానికి, ప్రొఫెషనల్స్‌కు పెద్ద సవాలుగా మారనున్నాయి. అయితే ఇక్కడ ఒక ఉపశమనం ఏంటంటే.. ఈ $100,000 ఫీజు నిబంధన ప్రస్తుతం అమెరికా వెలుపల ఉండి కొత్తగా H-1B ద్వారా వెళ్లాలనుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు, H-1B వీసాలపై పనిచేస్తున్న వారికి ఇది వర్తించదు. కాబట్టి అమెరికాలో ఉన్నవారంతా వెంటనే భయపడాల్సిన పనిలేదు.
కానీ భారతదేశం నుంచి అమెరికా వెళ్లాలనుకునే వారి విషయంలో మాత్రం కంపెనీలు పునరాలోచనలో పడే అవకాశం ఉంది. ఒక వర్కర్‌ను అమెరికా తీసుకెళ్లడానికి లక్ష డాలర్ల అదనపు భారం పడుతుండటంతో, కంపెనీలు అక్కడే స్థానికులను నియమించుకోవడానికో లేదా ప్రాజెక్టులను భారత్ వంటి దేశాలకే అవుట్‌సోర్స్ చేయడానికో మొగ్గు చూపవచ్చు. విదేశాల్లోని క్లయింట్ ప్రాంతాలకు ఉద్యోగులను పంపే సాంప్రదాయ బిజినెస్ మోడల్‌ను నమ్ముకున్న భారత ఐటీ కంపెనీలకు ఇది ఖర్చులతో కూడుకున్న వ్యవహారంగా మారనుంది. మరోవైపు, 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 3,63,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల్లో మనవాళ్లే ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి పై చదువుల తర్వాత ఉద్యోగ అవకాశాలపైనా ఈ విధానాలు ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మొత్తానికి వాషింగ్టన్ తీరును గమనిస్తే.. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుకుంటూ, కేవలం అత్యున్నత నైపుణ్యాలున్న విదేశీ ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.