Reading Time: 2 minutes

ఎల్‌నినో ఎఫెక్ట్: రబీ సీజన్ సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ కీలక హెచ్చరిక!

Caption of Image.

భారత వ్యవసాయ రంగానికి రాబోయే రబీ సీజన్ సవాళ్లతో కూడుకున్నది. ముఖ్యంగా వర్షాలపైనే ఆధారపడే ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ కార్యదర్శి అరీష్ చంద్ర సోమవారం హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారితే దేశంలో ప్రధాన ఆహార ధాన్యాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. రెండు రోజుల పాటు జరిగిన జాతీయ రబీ సన్నాహక సదస్సులో ఎల్‌నినో పరిస్థితులపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఖరీఫ్ అనుభవాలు.. రబీపై ఎల్‌నినో ఎఫెక్ట్
గడిచిన ఖరీఫ్ క్రాప్ సైకిల్ కూడా వర్షాధార ప్రాంతాల రైతులకు చాలా కష్టతరంగా సాగిందని అరీష్ చంద్ర గుర్తుచేశారు. పలు రాష్ట్రాలు తొలుత నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో.. ఆ తర్వాత చేతికి వచ్చిన పంటను కాపాడుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు వస్తున్న రాబోయే రబీ సీజన్‌లో ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల వర్షాధార వ్యవసాయ భూములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని నిపుణుల అంచనా. అక్టోబర్ నుంచి గోధుమలు, ఆవాలు వంటి రబీ పంటల సాగు ప్రారంభం కానున్న వేళ రైతన్నలకు ఈ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

వాతావరణ మార్పులు..
వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు రైతులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో మితిమీరిన తేమ ఉంటే, మరికొన్ని చోట్ల తగినంత వర్షాలు లేక సుదీర్ఘ కాలం పాటు కరవు పరిస్థితులు, పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందట. వాతావరణ మార్పుల ప్రభావం భవిష్యత్తులో ఉంటుందని భావించినప్పటికీ, అది ఇప్పుడు చాలా వేగంగా కళ్లముందే కనిపిస్తోందని అరీష్ చంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలు సైతం అకాల వర్షాల వల్ల పంట నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని చెప్పారు.

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ ఇప్పటికే స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ.. పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొన్ని ఉద్యాన పంటల కోసం మనం ఇప్పటికీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా రబీ సీజన్‌లో సుమారు 638 లక్షల హెక్టార్లలో పంటల సాగు జరుగుతుంది. ఇందులో ఒక్క గోధుమలే 300 లక్షల హెక్టార్లకు పైగా సాగవుతుండగా, పప్పుధాన్యాలు 140 లక్షల హెక్టార్లు, నూనెగింజలు 87 లక్షల హెక్టార్లు, చిరుధాన్యాలు 55 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయి.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతీయ వారీగా వ్యవసాయ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సూచించింది. మారుతున్న వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రాంతాలవారీ సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా రైతన్నలు తమ సాగు విధానాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కీలకంగా మారింది. 

©️ VIL Media Pvt Ltd.