Reading Time: < 1 minute

ఇవి కేవలం ఉప ఎన్నికలే: బెంగాల్ ఓటర్ల వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

Caption of Image.

కోల్‎కతా: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అప్పీళ్లకు సంబంధించిన కేసును అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేవలం ఉప ఎన్నికల దృష్ట్యా ఈ కేసును అత్యవసరంగా విచారించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారమే కేసు విచారణ చేపడతామని తెలిపింది.  

పశ్చిమ బెంగాల్‎లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)లో భాగంగా ఎన్నికల సంఘం వేల సంఖ్యలో ఓట్లను తొలగించిన విషయం తెలిసిందే. కొందరు ఓటర్లు తమ ఓటు తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీని ఆశ్రయించారు. దాదాపు 18 వేల కంటే ఎక్కువ అప్పీళ్లు ఈసీ దగ్గర పెండింగ్‎లో ఉన్నాయి. ఈ క్రమంలో సర్ పెండింగ్ అప్పీళ్లపై త్వరితగతిన విచారణ జరిపేలా ఈసీని ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. 

అయితే, నందిగ్రామ్, రెజీనగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సర్ అప్పీళ్లకు సంబంధించిన కేసును అత్యవసరంగా విచారించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. సర్ ఫిర్యాదులు పరిష్కారం కాకపోవడంతో వేలాది మంది ఓట్ వేసే హక్కు కోల్పోతారని పిటిషనర్ పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్బో బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం (సెప్టెంబర్ 28) ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టింది. 

►ALSO READ | మమతా బెనర్జీ పార్టీ గుర్తు ఎవరిది: శివసేన తరహాలోనే దీదీకి కష్టాలు

ఉప ఎన్నికల నేపథ్యంలో సర్ అప్పీళ్లకు సంబంధించిన కేసును అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇవి కేవలం ఉప ఎన్నికలు మాత్రమేనని పేర్కొన్న ధర్మాసనం పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5వ తేదీన తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. కాగా, అక్టోబర్ 6వ తేదీన నందిగ్రామ్, రెజీనగర్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.