
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్తను అందించింది. మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు సిటీ వరకు నూతనంగా ఒక ట్రై-వీక్లీ (వారానికి మూడు రోజులు నడిచే) ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలకు, మధ్య ప్రాంతాలకు మధ్య ప్రయాణ సౌకర్యాలను మరింత సులభతరం చేయడానికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడివాడ, వినుకొండ, నంద్యాల వంటి ప్రధాన ప్రాంతాలకు ఈ రైలు ద్వారా నేరుగా రైలు సౌకర్యం లభించనుంది.
మచిలీపట్నం – కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు మొత్తం 499 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తుంది. ఈ రైలు మచిలీపట్నంలో సాయంత్రం 16:55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05:45 గంటలకు కర్నూలు సిటీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఉదయం 09:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 21:35 గంటలకు మచిలీపట్నానికి చేరుకుంటుంది.
ఈ నూతన రైలు సేవలు మచిలీపట్నం నుంచి సోమవారం, బుధవారం, శనివారాలలో అందుబాటులో ఉంటాయి. అలాగే కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నానికి మంగళవారం, గురువారం, ఆదివారాలలో నడుస్తాయి. ఈ ప్రయాణ మార్గంలో ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంబమ్, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల మరియు డోన్ వంటి మొత్తం 12 ప్రధాన స్టేషన్లలో కమర్షియల్ స్టాపేజీలను కలిగి ఉంటుంది.
ఈ కొత్త రైలు సర్వీసు ప్రారంభం కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు అదనపు ప్రయాణ సౌలభ్యం కలగడమే కాకుండా.. మచిలీపట్నం, విజయవాడ , కర్నూలు సిటీల మధ్య కనెక్టివిటీ మరింత బలపడుతుంది. అంతేకాకుండా.. ఈ మార్గంలోని పలు పట్టణాలు , నగరాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు రవాణా సౌలభ్యం మెరుగవుతుంది.