Reading Time: < 1 minute
Guntur Car Fire Elderly Man Burnt Alive In Ipd Colony Son Injured

Guntur Car Fire: ఆస్పత్రికి వెళ్లి వైద్యులు అందుబాటులో లేకపోవడం ఇంటికి తిరుగు ప్రయాణం అయిన తండ్రీ కొడుకులు అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు.. తండ్రీ మృతి చెందగా.. కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ఐపీడీ కాలనీలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న తాడికొండ హరికృష్ణ అనే వృద్ధుడు సజీవదహనమయ్యారు. ఆయన కుమారుడు అఖిలేష్‌కు గాయాలయ్యాయి.

హరికృష్ణను ఆయన కుమారుడు అఖిలేష్‌ డయాలసిస్‌ కోసం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రిలో డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో తండ్రి, కొడుకులు కారులో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి సమీపంలోకి చేరుకున్న సమయంలో కారులోని ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో హరికృష్ణ కారులోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అఖిలేష్‌కు గాయాలు కావడంతో స్థానికులు కారులో నుంచి బయటకు లాగి కాపాడారు. ఐపీడీ కాలనీలో కారు మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయి, ఏసీ పేలడమే కారణమా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.