
భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడే చారిత్రక బాధ్యత మళ్ళీ కాంగ్రెస్ పై పడిందని.. ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇప్పుడు పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు మల్లికార్జున ఖర్గే. మంగళవారం ( సెప్టెంబర్ 29 ) సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు ఖర్గే.మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచిందని.. ఓటర్ల జాబితా నుంచి ప్రజల పేర్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారని, CEC జ్ఞానేశ్ కుమార్ మోదీ ప్రభుత్వానికి కీలుబొమ్మగా మారారని అన్నారు ఖర్గే.
అర్హులైన ప్రతి పౌరుడి ఓటు సురక్షితంగా ఉండాలని.. ప్రతి ఓటును నిష్పక్షపాతంగా లెక్కించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై పారదర్శకత అవసరం అని స్పష్టం చేశారు ఖర్గే. యువత ఓటు హక్కుకు సంబంధించిన ఫారం–6 నిబంధనలను నిశ్శబ్దంగా మార్చారని, ఇది చట్టవిరుద్ధమని అన్నారు. మా పోరాటం ఏ పార్టీ, సంస్థ లేదా వ్యక్తికి వ్యతిరేకంగా కాదని.. ఓటర్ల హక్కులు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసమేనని అన్నారు ఖర్గే.
మహాదేవపుర, అలంద్, హరియాణా, మహారాష్ట్ర అంశాల్లో రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటర్ల జాబితా అంశాలను ప్రస్తావించారు ఖర్గే. డూప్లికేట్ ఓటర్లు, సందేహాస్పద చిరునామాలు, ఒకే చిరునామాలో పెద్ద సంఖ్యలో ఓటర్లు, ఫారం–6 నమోదులపై ఎన్నికల సంఘం సమగ్రంగా పరిశీలించాల్సిందని అన్నారు ఖర్గే.
ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ 5 డిమాండ్లు:
- ఓటర్ల జాబితాలో జరిగే ప్రతి పెద్ద మార్పుకు సంబంధించిన పూర్తి డేటాను బహిరంగపరచాలి.
- పేర్లు తొలగించిన ఓటర్లకు సమాచారం, అప్పీల్ అవకాశం కల్పించాలి.
- ఓటర్ల జాబితా, కీలక డేటాను రాజకీయ పార్టీలకు సకాలంలో ఉపయోగించగల రూపంలో అందించాలి.
- తీవ్రమైన అవకతవకలపై ఆధారాలు ఉంటే స్వతంత్ర, కాలపరిమితి విచారణ జరపాలి.
- ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన డేటా, నిర్ణయాల్లో పూర్తి పారదర్శకత ఉండాలి.
సీఈసీని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఖర్గే. CECపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపిస్తూ ప్రధాని కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని అన్నారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ ఓటరు హక్కుకూ భంగం కలగకుండా చూడాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తిమంతుడు సాధారణ ఓటరేనని.. ఎన్నికలు, ప్రభుత్వాలు మారినా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం శాశ్వతమని ఖర్గే పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలని.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని.. సంస్థలు స్వతంత్రంగా ఉండాలిని అన్నారు ఖర్గే. నోట్ల రద్దు తరహాలోనే ఇప్పుడు “ఓట్ల రద్దు” ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు ఖర్గే. పేదలు, దళితులు, అణగారిన వర్గాల చేతిలోని అతిపెద్ద ఆయుధం ఓటు హక్కేనని అన్నారు ఖర్గే.