ప్రతి ఒక్కరికీ కారం కారంగా, రుచిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. అలాంటి సమయంలో బయట దొరికేవి కాకుండా ఇంట్లోనే ఇలా కారం కారంగా టమాటా ఉల్లికారం తయారు చేస్తే నోరూరిపోవడం ఖాయం. అంతే కాకుండా అన్నంతో ఒక్క ముద్ద తిన్నా రుచి మారిపోతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మరి ఈ టమాటా ఉల్లికారం ఇంట్లో సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర,ఆవాలు, కరివేపాకు, పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, నీళ్లు, కొత్తిమీర, నూనె. ఈ పదార్థాలతో చాలా సులభంగా టమాటా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయవచ్చును.
తయారీ విధానంలోకి వెళ్లితే.. కేజీ టమాటాలు తీసుకోవాలి. వాటిని పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దానిని కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని, అందులో సరిపడా నూనె వేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తరువాత కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి.
ఇప్పుడు పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగాక, చిటికెడు పసుపు, ఒక చిన్న స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత టమాటా ముక్కలను వేసి, ఉల్లిపాయలు, టమాటాలు బాగా కలిసేలా కలిపాలి.
బాగా కలిసిన తర్వాత దీనిని దాదాపు ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర స్పూన్ కారం వేసి బాగా కలపాలి. తర్వాత, చిన్న గ్లాసుతో కొద్దిగా నీళ్లు పోసి మళ్లీ బాగా కలిపి, ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. నూనె పైకి తేలేవరకు ఉడికిస్తే కూర సిద్ధమైనట్టే. తర్వాత , సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లి, మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ టమాటా ఉల్లికారం రెడీ.




