Reading Time: < 1 minute
Ap Government Ehs Funds For Employees And Pensioners From October 1

AP Government: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS)పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. EHS కింద ఉద్యోగులు, పెన్షనర్లు చెల్లించాల్సిన చందాలను నేరుగా NTR వైద్య సేవా ట్రస్ట్‌కు జమ చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన EHS నిధులను జమ చేయనున్నారు. ఉద్యోగి లేదా పెన్షనర్ చెల్లించాల్సిన 50 శాతం వాటాతో పాటు ప్రభుత్వం భరించే 50 శాతం వాటాను కూడా ఒకేసారి జమ చేయాలని నిర్ణయించారు. అంటే EHSలో ఉద్యోగి/పెన్షనర్ వాటా 50 శాతం కాగా, ప్రభుత్వ వాటా కూడా 50 శాతంగా ఉంటుంది. జీతాలు, పెన్షన్ల చెల్లింపుతో సమకాలంలోనే EHS నిధులను జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్‌కు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో EHS నిధుల జమ ప్రక్రియ మరింత క్రమబద్ధంగా కొనసాగనుంది.

మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ (EHS) కింద ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి వసూలు చేసే నెలవారీ చందాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను కూడా నిర్ణీత సమయంలో నేరుగా డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు బ్యాంకు ఖాతాకు జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీయూష్‌ కుమార్‌ సోమవారం జీవో నంబర్‌ 131 జారీ చేశారు. ఈ కొత్త విధానం అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇకపై ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లు చెల్లించే సమయంలోనే EHSకు సంబంధించిన నెలవారీ చందాలను కూడా ట్రస్టు ఖాతాకు బదిలీ చేయనున్నారు. ఇక గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం EHSలో ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వం మధ్య నిధుల వాటా నిష్పత్తి 50:50గా ఉంది. తాజా నిర్ణయంతో ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సేవలకు అవసరమైన నిధులు నిర్దిష్ట సమయంలో ట్రస్టుకు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పించే చర్యగా పేర్కొంటున్నాయి.