Reading Time: < 1 minute
Ap Government Writes To Krmb Over Srisailam Water Use Seeks 6634 Ratio

AP Government: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తోందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి లేఖ రాసింది. రానున్న కేఆర్‌ఎంబీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, రాష్ట్ర ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం బోర్డుకు పంపింది. శ్రీశైలం జలాశయం నుంచి 12 రోజుల్లో సుమారు 21 టీఎంసీల నీటిని వినియోగించినట్లు ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ భాగం తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అందుబాటులో ఉన్న కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నిష్పత్తి గతంలో కేఆర్‌ఎంబీ పని విధానంలో కొనసాగిన వ్యవస్థకు అనుగుణంగా ఉందని బోర్డు వార్షిక నివేదికలోనూ నమోదైంది.

అలాగే కేఆర్‌ఎంబీ హెడ్‌క్వార్టర్స్‌ను అమరావతికి మార్చాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. వచ్చే నెల 1న జరగనున్న కేఆర్‌ఎంబీ సమావేశంలో ఈ అంశాలతో పాటు ఇతర జలవినియోగ అంశాలను చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి తెలంగాణ నీటిని విడుదల చేస్తున్న అంశంపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి వినియోగం, పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.