Reading Time: < 1 minute
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష.. ఎప్పుడంటే..?

తెలంగాణలోని యువతకు గుడ్ న్యూస్. రాజీవ్ యువ వికాసం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది.  డబ్బులు అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయనే దానిపై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉన్నతి కల్పించే లక్ష్యంతో రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.  నవంబరు 19 నుంచి అర్హులకు రూ.లక్ష చొప్పున  సాయం అందిస్తామని, వీటిని నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో యువత ఈ నగదు కోసం ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు క్లారిటీ ఇవ్వడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.

గీత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన కాతమయ్య రక్షణ కవచాలు పథకం కింద ఇప్పటివరకు 50 వేల మందికి కిట్లు మంజూరు కాగా.. ఇప్పటికే 40 వేల కిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికి శిక్షణ పూర్తయ్యాక కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం మొత్తం 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద ఈ ఏడాది మొదటి, రెండవ విడతలో 180 మంది విద్యార్థులకు 18.40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించారు. గురుకుల విద్యాలయాలకు సొంత భవనాల మంజూరు, బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధుల విడుదల అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.