Reading Time: 2 minutes
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ ఊరట.. ఈ ఒక్క యాప్‌లో 10 రకాల సేవలు.. ఒకే క్లిక్‌తో పొందవచ్చు..

ఈపీఎఫ్ సేవల కోసం పీఎఫ్ కార్యాలయలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి వద్దనే ఉండే స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ సేవలు పొందవచ్చు. ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపరుస్తుంది. కేవలం పోర్టల్ ద్వారానే కాకుండా ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో ఒక్క యాప్ ద్వారా పీఎఫ్ సేవలన్నీ సులువుగా పొందవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం దగ్గర నుంచి క్లెయిమ్ స్టేటస్ చెకింగ్ వరకు 10 రకాల పీఎఫ్ సేవలు ఉమాంగ్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉమాంగ్ యాప్ ద్వారా వీటిని ఎలా యాక్సెస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం.

పాస్ బుక్ చెక్ చేస్కోండిలా..

ఉమాంగ్ యాప్‌లో మీరు పాస్ బుక్ తనిఖీ చేసుకోవచ్చు. మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు. నెలవారీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్, లావాదేవీలను ట్రాక్ చేయవచ్చు. కంపెనీ మీ అకౌంట్లో నగదు జమ చేసిందా.. లేదా అనేది తెలుసుకోవచ్చు

పీఎఫ్ క్లెయిమ్ దాఖలు చేయండి

ఇక ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ క్లెయిమ్ కోసం దాఖలు చేయవచ్చు. పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి సింపుల్‌గా యాప్ ద్వారా ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. ఉమాంగ్ యాప్ ఉపయోగించి ఆన్ లైన్‌లో క్లెయిమ్ సమర్పించవచ్చు. అనంతరం క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.

యూఏఎన్ యాక్టివేషన్

ఉమాంగ్ యాప్ ద్వారా మీరు యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసకోవచ్చు. ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ ప్రక్రియ ఉపయోగించి యాక్టివేట్ చేసుకునే సౌకర్యం ఉంది. అలాగే కొత్త యూఏఎన్‌ను సులువుగా పొందవచ్చు. ఇందుకు కూడా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అవసరం.

జీవన్ ప్రమాణ్ సమర్పించండి

పెన్షనర్లు తమ జీవన్ ప్రమాణ్ లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ఉమాంగ్‌ యాప్ ద్వారా సమర్పించవచ్చు. దీనివల్ల పెన్షన్ ప్రక్రియ మరింత సులభంగా పూర్తి చేయవచ్చు. ఇక పెన్షన్ పాస్‌బుక్‌ను కూడా ఇందులో చూడవచ్చు. అలాగే పీఎఫ్‌క ఖాతాకు సంబంధించి సమగ్ర సమాచారం ఉమాంగ్ యాప్‌లోని పీఎఫ్ సర్వీసుల ద్వారా తెలుసుకోవచ్చు.  UMANG యాప్ ద్వారా ఉద్యోగులు EPFO ​​కార్యాలయానికి వెళ్లకుండానే PF, UAN, పెన్షన్ సేవలు సులభంగా పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉమాంగ్ యాప్ అందుబాటులో ఉంటుంది. డౌన్ లోడ్ చేసుకున్నాక మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. అనంతరం సెర్చ్‌లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. అనంతరం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సర్వీసులను ఎంచుకుని ఆన్ లైన్ సేవలు పొందవచ్చు.